Wednesday, November 27, 2024

Parawada – ఫార్మాసిటీలో విష‌వాయువు లీక్ … ఒక‌రి మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో గ్యాస్‌ లీక్​ అయిన ప్ర‌మాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మంగళవారం రాత్రి ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్‌ అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని దగ్గరలోని ఆసుపత్రిలో తీసుకెళ్లారు. ఈ ప్రమాదంంలో ఓ కార్మికుడు నేడు మృతి చెందాడు. మృతుడు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు.

మెరుగైన వైద్యం అందించాలి: చంద్ర‌బాబు

విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని క్రిటికల్ కేర్‌ సెంటర్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.

నిర్లక్ష్యం వీడాలి: హోం మంత్రి

ఫార్మాసిటీ ప్రమాదంపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీలు నిర్లక్ష్య వైఖరి వీడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి, అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీతో ఫోన్​లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని అనిత వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement