పరవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు బండారు ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి రోజా పై ఇటీవల మంత్రి బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుంటూరు అర్బన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు పోలీసులు మాజీ మంత్రి బండారును అరెస్ట్ చేసేందుకు ఆయన స్వగ్రామం వెన్నెల పాలేమునకు చేరుకున్నారు. పరవాడ పోలీసులు సహకారంతో బండారును అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం బండారును అరెస్ట్ చేసేందుకు పరవాడ డి.ఎస్.పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరు పోలీసులు ప్రయత్నించారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వివరాలు తెలపాలని బండారు నిలదీయడంతో పోలీసులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు.
దీంతో వెన్నలపాలెంలో తీవ్ర ఉదృత పరిస్థితి నెలకొంది. ఏ క్షణాన్నైనా బండారును అరెస్ట్ చేస్తారు అన్న సమాచారం పెందుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం సాగడంతో టిడిపి శ్రేణులు భారీగా బండారు ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, కార్పొరేటర్ పిలా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వెన్నెల పాలెం చేరుకొని బండారు కు బాసటగా నిలిచారు. బండారు ఇంటి చుట్టూ పోలీస్ బలగాలను మొహరించడంతోపాటు స్టాపర్స్ ఏర్పాటు చేశారు. సిఆర్పిసి 41 ఏ నోటీస్ ఇస్తారా లేదా బండారు అరెస్ట్ చేసి గుంటూరు తరలిస్తారా అన్న సందిగ్ధ స్థితి నెలకొంది. మాజీ మంత్రి బండారును అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు హుటాహుటిన సోమవారం ఉదయం పరవాడ చేరుకున్నారు.