విజయనగరం, (ప్రభ న్యూస్) : పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు సర్పంచ్ స్థానాలకు, మరో రెండు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద సగటున 86.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది . భోగాపురం మండలం లింగాలవలస సర్పంచ్ స్థానానికి సంబంధించి 89.42 శాతం పోలింగ్ నమోద కాగా ఆ స్థానాన్ని టీడీపీ మద్ధతుదారు కైవసం చేసుకున్నారు.
అదే విధంగా నెల్లిమర్ల మండలం ఏటీ అగ్రహారం సర్పంచ్ స్థానానికి సంబంధించి 90.30 శాతం పోలింగ్ నమోదు కాగా ఆ స్థానాన్ని అధికార వైసీపీ మద్ధతుదారు కైవసం చేసుకున్నారు. ఎల్‌కోట మండలం రేగలోని వార్డు మెంబర్ స్థానానికి 85.39 శాతం, మక్కువ మండలం కాశీపట్నం వార్డు మెంబర్ స్థానానికి 63.62 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ రెండు స్థానాలు టీడీపీ మద్ధతుదారులు గెలుచుకున్నారు.
ఎన్నికల అనంతరం మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. లింగాలవలస సర్పంచ్ ఎన్నికలో బుగత లలిత సర్పంచ్‌గా గెలుపొందారు. ఎటి అగ్రహారంలో సర్పంచ్‌గా మీసాల సూర్యాకాంతం గెలుపొందారు. వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి రేగలో లెంక శ్రీను, కాశీపట్నంలో అల్లు కృష్ణవేణి గెలుపొందారు. పట్టిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
పంచాయితీ ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని, బూత్‌ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటూ పలు ఆదేశాలను జారీ చేసారు. నెల్లిమర్ల మండలం ఎటి అగ్రహారం వద్ద నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి డీఆర్‌వో ఎం. గణపతిరావు, జిల్లా పంచాయితీ అధికారి ఎస్. సుభాషిణి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily