Friday, October 25, 2024

Palnadu – అతిసారంపై అప్రమత్తం – దాచేపల్లిలో తాగునీటి బోర్లు బంద్

ట్యాంకర్లతో మంచినీరు సరఫరా
ఆరుగురికి అతిసార.. ఇద్దరు మృతి
సీఎం చంద్రబాబు సీరియస్… మంత్రి నారాయణ ఆరా
అధికారుల్లో తక్షణ కదలిక

ఆంధ్రప్రభ స్మార్ట్, పల్నాడు జిల్లా బ్యూరో : పల్నాడు జిల్లా దాచేప‌ల్లిలో డ‌యేరియా ప‌రిస్థితిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. పల్నాడు కలెక్టర్‌ సహా ఇతర అధికారులతో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం దాచేపల్లిలో డయేరియా అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ వివ‌రించారు. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యాధికారులు వెల్ల‌డించారు. మరోవైపు స్థానిక బోర్లను మూసివేసి ట్యాంక‌ర్ల ద్వారా తాగునీటిని న‌గ‌ర‌ పంచాయ‌తీ అధికారులు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

డ‌యేరియా విజృంభ‌ణ‌.. ఇద్ద‌రి మృత్యువాత‌
కాగా.. దాచేపల్లిలో నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అతిసార తీవ్రతో ఇప్పటికే ఇద్దరు మృతువాత పడగా, 16 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కలుషిత తాగునీరు తాగడం వల్లే అతిసారం ప్రబలిందని అధికారులు నిర్ధారించారు. తాగునీటి పైపు లైన్లు మురుగు కాలువలో ఉండటం వల్ల నీరు కలుషితమై ఉండవచ్చని భావిస్తున్నారు. డయేరియాతో డిగ్రీ విద్యార్థి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు (21), బండారు చిన వీరయ్య(63) మృతి చెందారు. వీరు ఇద్దరు మృతి చెందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

- Advertisement -

గ్రామంలో వైద్యం శిబిరం ఏర్పాటు
డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవి నేతృత్వంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందజేస్తున్నారు. కాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శిరి గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాచేపల్లి పరిస్థితిపై ఆరా తీసిన విషయం తెలిసిందే. డయేరియాతో ఇద్దరు చనిపోయిన విషయంపై కలెక్టర్‌తో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. డయేరియాకు కలుషిత నీరు కారణమా.. లేదా ఇత‌ర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దాచేపల్లిలో పరిస్థితిని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. బోర్లను మూసి వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలంటూ చంద్ర‌బాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం తాగునీటి బోర్లను మూసివేసిన న‌గ‌ర‌పంచాయ‌తీ అధికారులు ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

కలుషిత నీటితోనే…
అంజనాపురంలో తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్‌ ట్యాంక్‌ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement