గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి: గుంటూరు జిల్లా పల్నాడు అట్టుడుకుతోంది. మాచర్ల పట్టణమంతా పోలీసు వలయంలో ఉంది. సెక్షన్ 144 కింద ఆంక్షలు అమలులో విధించారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారు. మరికొంతమంది ని అరెస్ట్ చేశారు. మాచర్ల పట్టణంలోకి వెళ్లే దారులు అన్నింటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పలు చోట్ల పోలీసు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. మాచర్లతో పాటు పలు సున్నిత ప్రాంతాలలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మాచర్ల పట్టణంలో శుక్రవారం రాత్రి విధ్వంసకాండ జరగడమే దీనికి కారణం.
తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు ఆ పార్టీ శ్రేణులు ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాచర్ల రింగ్ రోడ్డు వద్ద ప్రారంభమైన ప్రదర్శన మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకునే సమయానికి కొంతమంది ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. వారంతా వైసీపీ కార్యకర్తలే నని తెలుగుదేశం నాయకుల ఆరోపణ. వారిని ప్రతిఘటించడం తో ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్ళు , సీసాలు విసురుకున్నారు. మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడనుంచి ఆ రాత్రే గుంటూరుకు తరలించారు. మాచర్ల లోని బ్రహ్మారెడ్డి ఇంటితో పాటు మరో ఇద్దరి గృహాలకు నిప్పుబెట్టారు. పలు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు సకాలంలో స్పందించక పోవటం వల్లనే ఇదంతా జరిగిందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
గృహ నిర్బంధాలు..
పార్టీ శ్రేణులు మాచర్ల తరలిరావాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను శనివారం తెల్లవారుఝాము నుంచే గృహనిర్బంధంలో వుంచారు. మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే లు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జివి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు లను గృహనిర్బంధం చేశారు. చదలవాడ అరవింద బాబు, డాక్టర్ కోడెల శివరాం లను పోలీసు నిర్బంధం చేశారు. గృహనిర్బంధం లో వున్నప్పటికీ, ఆనందబాబు, ధూళిపాళ్ల లు గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడనుంచి పోలీసు వలయాన్ని చేదించుకోని మాచర్ల వెళ్ళే ప్రయత్నం చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నాయకులను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు నిలువరించారు.
చంద్రబాబు సీరియస్..
మాచర్ల సంఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు రేంజి ఐ జి తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి పరిస్తితి తెలుసుకున్నారు. పోలీసులు నిస్పక్షపాతం గా వ్యవహరించాలని, దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చన్నాయుడు తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న పార్టీ నాయకులు మాచర్ల సంఘటనను ఖండించారు.
ఫ్యాక్షన్ కారణంగానే : పల్నాడు ఎస్పీ
మాచర్ల పట్టణంలో ఇరువర్గాలు మధ్య జరిగిన సంఘటనకు ఫ్యాక్షన్ నేపథ్యం వున్నదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. గతంలో వెల్దుర్తి, మాచర్ల, పరిసర ప్రాంతాలకు చెందిన, పలు హత్యకేసులలో నిందితులు గురించి తమకు సమాచారం అందిందని ఎస్పీ చెప్పారు. దాని ఆధారంగా ఆరోజు తెల్లవారుఝామున కార్దన్ సెర్చ్ జరిపినట్టు నట్టు తెలిపారు. కొంతమంది వ్యక్తులను గుర్తించి నప్పటికీ వారివద్ద ఏవిధమైన ఆయుధాలు లభించలేదు అని చెప్పారు. మాచర్ల లో జరిగిన గొడవలు గత 20 లేదా 30 సంవత్సరాల నుంచి వున్న ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగినవేనని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి పరిస్తితి అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు.