అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: చెన్నై కేంద్రంగా కొంత మంది ఆయిల్ దిగుమతిదారులు మాఫియాగా ఏర్పడి పామాయిల్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు రవాణాచేస్తూ రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. భోపాల్ రాష్ట్రంలో సేల్ టాక్స్ లేదు. అక్కడి ప్రభుత్వ నిబంధనలను కొంత మంది అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మలచుకుని భోపాల్ పేరుతో ఆంధ్ర, తమిళ నాడు, కర్నాటక రాష్ట్రాలకు నిత్యం 10 వేల టన్నులకు పైగా పామా యిల్‌ను దొడ్డిదారిన సరఫరాచేసి దోచుకుంటున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రావల్సిన జీఎస్టీతోపాటు సేల్ టాక్స్ పక్కదారి పడుతోంది. ప్రతి నెలా సుమారు రూ. 450 కోట్లకుపైగా పన్నును ప్రభుత్వాలు కోల్పోతున్నాయంటే పాయిల్ అక్రమ రవాణా ఏస్థాయి లో సాగుతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మలేషియా, ఇండోనేషియా నుండి భారీ నౌకల ద్వారా నిత్యం చెన్నై ఓడరేవుకు 6 నుండి 10 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన నౌకల ద్వారా పామాయిల్ దిగుమతి అవుతుంటుంది. అయితే, కొంత మంది దిగుమతిదారులు మాఫియాతో చేతులు కలిపి పామాయిల్‌ను భోపాల్‌కు తరలిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతూ చెన్నైకి పొరుగున ఉన్న ఆంధ్ర, కర్నాటకతోపాటు తమిళనాడు రాష్ట్రాలకు నిత్యం 10 వేల టన్నుల ఆయిల్‌ను సరఫరా చేస్తున్నారు. నెలకు సుమారుగా 2.50 లక్షల టన్నుల ఆయిల్‌ను పై మూడు రాష్ట్రాల పరిధిలో వివిధ ప్రాంతాలకు దిగుమతి చేస్తున్నారు. దీంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆయిల్ పరిశ్రమల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతోపాటు వాటిపై ఆధారపడ్డ వ్యాపారులు నష్టపోవాల్సి వస్తోంది. కొన్ని పరిశ్రమల్లో అయితే కార్మికులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.
భోపాల్ పేరుతో భారీ దోపిడీ
ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పామాయిల్ సరఫరా చేయాలంటే అందుకు సంబంధించి రవాణ అనుమతితోపాటు సేల్ టాక్స్, జీఎస్టీ చెల్లించాలి. వాటితోపాటు ఏ ప్రాంతానికి తరలిస్తున్నారో ఆయా ప్రాంతాలకు సంబంధించి అనుమతులకోసం మరికొన్ని శాఖలకు పన్ను చెల్లించాలి. అయితే భోపాల్‌లో మాత్రం సేల్ టాక్స్ వసూలు చేయరు. దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది దిగుమతిదారులు చెన్నై కేంద్రంగా భోపాల్ పేరుతో నిత్యం భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనల మేరకు భోపాల్‌లో ఆయిల్ సరఫరా చేయాలంటే సేల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ రవాణా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే మాఫియా భోపాల్ అనుమతులతోనే ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అక్రమంగా ఆయిల్ సరఫరా చేస్తోంది.
నెలకు 2.50 లక్షల టన్నుల ఆయిల్ అక్రమ రవాణ
చెన్నై కేంద్రంగా రోజుకు 10 వేల టన్నుల వంతున నెలకు సుమారుగా 2.50 లక్షల టన్నుల పామాయిల్ అక్రమ రవాణా జరుగుతోంది. మూడు రాష్ట్రాల పరిధిలో నిత్యం భోపాల్ పేరుతో ట్యాంకర్లు పామాయిల్‌ను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం పామాయిల్ ధర రాష్ట్రంలో లీటర్/కేజీ రూ. 90 వరకూ పలుకుతోంది. ఈలెక్కన రోజుకు రూ.90 కోట్ల వంతున నెలకు సుమారుగా రూ. 2,200 కోట్లకుపైగా ఆయిల్ అమ్మకాలు సాగుతున్నాయి. ఆయా అమ్మకాలకు సంబంధించి 15 శాతం జీఎస్టీ , 5 శాతం సేల్ టాక్స్ రూపంలో 20 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. ఆలెక్కన నెలకు రూ. 450 కోట్లకుపైగా ఆదాయానికి గండి పడుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు రాష్ట్రంలో అక్రమంగా రవాణా అవుతున్న పామాయిల్ టాంకర్లను అడ్డుకోలేకపోతున్నారు. భోపాల్ అనుమతులతో రాష్ట్రంలో అడుగుపెడుతున్న వాహనాలపై కేసులు నమోదు లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
ఏపీలో నష్టపోతున్న ఆయిల్ కంపెనీలు
రాష్ట్రంలోని వివిధ ఓడ రేవులకు నిత్యం ఇండోనేషియా, మలేషియా నుండి పామాయిల్ దిగుమతి అవుతుంది. వాటి పరిధిలో కొన్ని పరిశ్రమలు పామాయిల్‌ను రీ ఫిల్లింగ్ చేసి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు సరఫరా చేస్తోంది. ఈనేపథ్యంలో ఆయా పరిశ్రమల్లో వందలాదిమంది కార్మికులకు ఉపాధి కూడా లభిస్తోంది. ఉదాహరణకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో పంటపాలెం వద్ద 8 ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. వాటి పరిధిలో నిత్యం పామాయిల్‌ను 250కుపైగా ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అయితే చెన్నై కేంద్రంగా మాఫియా భోపాల్ పేరుతో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు పామాయిల్‌ను అక్రమంగా దిగుమతి చేస్తుండటంతో ఆయా పరిశ్రమల్లో అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని కంపెనీలు కార్మికులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్తితికి చేరుతున్నాయి. అలాగే పామాయిల్ వ్యాపారంపై ఆధారపడ్డ మరికొంత మంది వ్యాపారులు కూడా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఆయా శాఖలకు చెందిన రాష్ట్ర స్తాయి అధికారులు స్పందించి చెన్నై కేంద్రంగా ఏపీకి సరఫరా అవుతున్న భోపాల్ ఆయిల్‌ను అడ్డుకుని మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.