ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది. ఏ-1 నుండి ఏ-4 వరకు బెయిల్ లభించింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో పల్లవి ప్రశాంత్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారని.. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. అభిమానులు రెచ్చిపోవడానికి ప్రశాంతే కారణం అంటూ అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే కోర్టులో విచారణల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అలాగే ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది. దాంతో పాటు 15 వేలు రుపాయలుతో రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ ను ఆదేశించింది.