తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుపతి నగరంలోని ఆర్ సి రోడ్డు సెంటర్ లో ఉన్న అన్నమాచార్య విగ్రహం తలపై ఎవరో అన్యమత టోపీ పెట్టడం సంచలన వివాదం రేపుతోంది. దాన్ని గమనించిన కొందరు ఆందోళన చేపట్టారు. వారికి ఇటీవల ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఒక అధ్యాపకునిపై దాడి చేసిన వారు మద్దతుగా నిలిచారు. ఇంతలో జోక్యం చేసుకున్న కొందరు ఆ టోపీని తీసివేశారు. నిత్యం రద్దీగా ఉండే ఆ సెంటర్ లో ఎవరో కావాలనే మతపరమైన వివాదం రేపడానికే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి నగరంలో గతంలో ఎన్నడూ జరగని ఈ ఘటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రముఖ హిందూ ధార్మిక క్షేత్రం తిరుపతిలో అన్నమయ్యకు అపచారం చేసిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉద్రిక్తత సృష్టించే ఇటువంటి ఘటనలను క్రైస్తవ మత పెద్దలు కూడా ఖండించాలన్నారు.
దీనిపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ… ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుడు కందారపు మురళి తిరుపతిలో మతపరమైన అశాంతిని రేపడానికి ఒక పథకం ప్రకారం కొందరు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తూ కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.