తిరుపతి రూరల్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.కార్యక్రమంలో టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ..
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మొదటి రోజైన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.