Friday, October 18, 2024

AP | వైద్య విద్యకు పాడేరు అనువైన ప్రాంతం : కలెక్టర్ దినేష్ కుమార్

పాడేరు : వైద్య విద్యకు పాడేరు ఒక‌ సురక్షిత ప్రాంతమని, భయాందోళనలు లేకుండా వైద్య విద్యార్థులు విద్యనభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ మెడికల్ విద్యార్ధులకు సూచించారు. ఎంబీబీఎస్ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం అయిన‌ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య కళాశాలను ప్రారంభించి, హాజరైన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

పాడేరు వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు 50 మంది ఎంబీబీఎస్ మొద‌టి సంవత్సరం ప్రవేశాలు కల్పించారు. కాగా 42 మంది విద్యార్థులు ప్రవేశం పొంది కళాశాలలో చేరారు. తల్లిదండ్రులతో పాటు వారిని కళాశాలకు ఆహ్వానించిన కళాశాల యాజమాన్యం వారితో సమావేశం ఏర్పాటు చేసి ఘనస్వాగతం పలికింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ ఏడాది నుంచి వైద్య తరగతులు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు గత నెల రోజులుగా కష్టపడి అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు తదితరాలను పూర్తి చేయడం గొప్ప విషయమని కొనియాడారు.

అదేవిధంగా కొంత మంది తల్లిదండ్రులు పాడేరు అంటే వెనుకడుగు వేస్తున్నారని, ఎటువంటి సమస్యలు లేని ప్రశాంతమైన వాతావరణంలో వైద్య విద్యకు అనువైన ప్రాంతం పాడేరు అని కలెక్టర్ పేర్కొన్నారు. 15 ఏళ్ళ క్రితం తీవ్రవాద ప్రభావం ఉండేదని, ప్రస్తుతం తీవ్రవాదుల నుండి ఎటువంటి చర్యలు లేవని తెలిపారు.

చాలా మంది దీనిని రిమోట్ ఏరియా అనుకుంటారని, కానీ రెండు గంటలలో విశాఖపట్నం చేరుకొని ఎక్కడికైనా వెళ్ళగలమని వివరించారు. జిల్లాలో సుమారు 1100 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే పనులు జరుగుతున్నాయని, త్వరలో అవి పూర్తీ చేస్తామని చెప్పారు.

- Advertisement -

అత్యంత ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణంలో విద్యార్ధులు ఎటువంటి భయాందోళనలు గురికాకుండా వైద్య విద్యను అభ్యసించాలని కోరారు. అన్ని రకాలుగా రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. మరో రెండు మూడు నెలల్లో అన్ని సౌఖర్యాలు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఇక్కడ చదువుకున్న వారికి అవుట్‌పేషంట్లు, ఇన్‌పేషంట్లు అందుబాటులో ఉంటారని, ఇక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సికిల్సెల్ అనీమియా, మలేరియా లాంటి వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు కూడా వస్తాయని, వాటిపై అధ్యయనం చేయడానికి మెడికల్ విద్యార్ధులకు అవకాశాలు ఉంటాయని, అదే విధంగా గిరిజన రోగులకు సేవలందించే అవకాశం కలగటం అదృష్టంగా భావించాలని కలెక్టర్ తెలిపారు.

కళాశాలలో ఆయా శాఖల విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, సహాయ ప్రొఫెసర్లు విద్యార్ధులను స్వంతంగా భావించి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గిరిజనులు కూడా వారి వారి సంప్రదాయాలతో పాటు ఉన్నత విద్యలను అభ్యసిస్తున్నారని, గిరిజనులు గౌరవప్రదంగా, మంచిగా ఉంటారని కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement