Tuesday, November 26, 2024

ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లో చేరిన మాజీ మంత్రి ప‌డాల అరుణ

విశాఖ‌ప‌ట్నం – జనసేన సిద్ధాంతాలను అర్థం చేసుకొని, భవిష్యత్తు తరాలకు అండగా నిలబడాలనే సదుద్దేశంతో పార్టీలోకి వచ్చే ఏ నాయకుడినైనా సాదరంగా ఆహ్వానిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. . గురువారం ఉదయం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి పడాల అరుణ కుటుంబసమేతంగా జనసేన పార్టీలో చేరారు. అరుణ కి పవన్ కళ్యాణ్ రు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని మాట్లాడుతూ, అలాంటి లక్ష్యంతో ముందుకు వచ్చి జనసేన పార్టీలో చేరిన పడాల అరుణ ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బలమైన నాయకురాలు రావడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పారు.

“విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి పడాల అరుణ మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై నిలదీసిన ఆమె పోరాట స్ఫూర్తి జనసేన పార్టీకి ఎంతో అవసరం. ఏ పదవి ఆశించకుండా భవిష్యత్తు తరాల కోసం జనసేన పార్టీ నాయకులు పడుతున్న కష్టాల చూసి ప్రభావితమై పార్టీలోకి వచ్చానని ఆమె చెప్పడం చాలా ఆనందం కలిగించింది” అన్నారు.

రాబోయే తరానికి పవన్ కళ్యాణే నాయకుడు : పడాల అరుణ

మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ “జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే తరానికి కాబోయే నాయకుడు. వచ్చే తరానికి ఒక అద్భుతమైన మార్గదర్శకం చేయాల్సిన సరికొత్త నాయకుడు పవన్ కళ్యాణ్ . ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూ, అక్రమార్కులను ఎండగడుతూ ఆయన సాగిస్తున్న ప్రయాణంలో నేను భాగస్వామురాలిని కావడం ఆనందంగా ఉంది. పార్టీ ఉన్నతి కోసం సాయశక్తుల పని చేస్తాను. ఓ సోదరుడి నాయకత్వంలో నిస్వార్థంగా పని చేసే కార్యకర్తగా ముందుకు వెళ్తాను” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement