తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ ) : విజన్ 2047 ఆలోచనలో భాగంగా తన స్వగ్రామం నారావారిపల్లె ప్రాంతాన్ని ఏడాదిలోగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రణాళిక ను అమలు చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సంక్రాంతి సందర్బంగా రెండురోజుల పాటు కుటుంబ సభ్యుల, గ్రామస్తుల మధ్య గడిపిన ఆయన ఈరోజు సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు.
వెళ్లే ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గం కుప్పం తరహాలో తన స్వగ్రామం నారావారిపల్లె ప్రాంత ని ఒక మోడల్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. 3 గ్రామ సచివాలయాల పరిధిలోని 2500 కుటుంబాలకు చెందిన 5900 మంది జీవన ప్రమాణాలను పెంపొందించడమే తన లక్ష్యం అని తెలిపారు.
ముందుగా ఒక నెల రోజుల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులన్నీ కలిపిస్తామని చెప్పారు. మరో మూడునెలల్లో అన్ని ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సూర్య ఘర్ పధకం కింద సంపూర్ణ సౌర విద్యుత్ ప్రాంతం గా రూపుదిద్దుతామన్నారు. ప్రభుత్వ పరంగా చేసే పనులు చేస్తూనే ప్రైవేటు, ప్రజల సమన్వయ భాగస్వామ్యంతో ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి కి మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఏడాది లోగా అన్నివిధాలా అభివృద్ధి చేసి ఫలితాల ఆధారంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లలో అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే శ్రీ సిటీ యాజమాన్యం ద్వారా రూ కోటి 30 లక్షలతో రంగంపేట హై స్కూల్ ను మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు వంటి పనులు చేస్తామని చెప్పారు. ఈ ఆలోచనల గురించి నారావారిపల్లె ప్రాంత ప్రజలతో చర్చించామని, వారు సహకరించడానికి అంగీకరించారని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, శాసనసభ్యులు పులివర్తి నాని, మురళీమోహన్, శాప్ చైర్మన్ రవినాయుడు, తెలుగుదేశం నాయకుడు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ పాల్గొన్నారు.