Tuesday, November 26, 2024

AP | సొంతిల్లు బహుభారం.. రాష్ట్రంలో పెరిగిన భూముల రేట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చూసి చూడు అంటారు పెద్దలు’.. రెంటింటికీ ఎంత ఖర్చు పెట్టినా ఏదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం పెళ్లయితే భారీగా చేయోచ్చేమోకానీ.. ఇల్లు కట్టాలన్నా..కొనుగోలు చేయాలన్నా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఒకటి రెండు సార్లు ఆలోచిం చాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. చిన్నపాటి స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవాలంటేనే రూ.అరకోటి అంతకు మించి ఖర్చు చేయాల్సి వస్తుండటంతో చాలా మంది ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది.

ఇక బిల్డర్ల దగ్గర కొనుగోలు చేయాలంటే 200 గజాలలో కట్టిన ఇంటికి రూ.కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత రెండేళ్ల క్రితం భూమి కొనుగోలు చేయాలనుకుని ఇల్లు నిర్మించుకోడానికి కావాల్సిన నగదు సమకూరిన తర్వాత వెతుకుదామనుకున్నారు. కానీ తీరా ఇంటి నిర్మాణానికి సరిపడా నగదు చూసుకుని మార్కెట్‌లోకి అడుగుపెడితే ప్రస్తుతం ఆ నగదుకి కనీసం భూమి కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.

గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో ఉన్న ధరలకు ప్రస్తుతం మూడురెట్లు ధరలు పెరగడంతో స్థలాలు కొనుగోలు చేద్దామని ముందుకు వచ్చిన వారు వెనుదిగరక తప్పడం లేదు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో గజం స్థలం రూ.లక్షల్లోనే పలుకుతోంది. విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని సీఎం ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత విశాఖ ప్రాంతంలో సెంటు స్థలం భారీగా పెరిగిపోయింది.

- Advertisement -

దాంతో స్థలం కొనుగోలు చేయాలంటే సామాన్యులు వామ్మో అంటున్నారు. ఇదిలా ఉండగా, కోవిడ్‌కు ముందు అందుబాటులో ఉన్నాయనుకున్న స్టీల్‌ ధరలు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. ఇసుక ధర దాదాపు తక్కువకు అందుతున్నా.. స్టీల్‌ ధరలు మాత్రం ఆకాశనంటుతున్నాయి. దీంతో సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న కలను సాకారం చేసుకోవడం కష్టంగా మారింది. మరో వైపు అపార్టుమెంట్లలో ప్లాట్ల ధరలూ పెరిగిపోయాయి.

ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఏడాది వ్యవధిలో 25 నుంచి 40 శాతం పెరిగాయి. సిమెంటు, స్టీలు, విద్యుత్‌ కేబుల్స్‌, తలుపులు, కిటికీలకు బిగించేందుకు వాడు మేకులు ధరలూ పెరిగాయి. ప్రధానంగా సిమెంటు ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు డీలర్లు ప్రజలకు నాన్‌ట్రేడ్‌ బ్రాండ్లు అంటగడుతున్నారు. ప్రజలు కూడా ఒరిజనల్‌ బ్రాండ్లు దొరకకపోవడం, కాసింత తక్కువ ధరకు సిమెంటు లభించడంతో నాన్‌ట్రేడ్‌ బ్రాండ్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఒరిజనల్‌ బ్రాండ్ల ధరలు పెరగడంతో కొందరు డీలర్లు అక్రమ సిమెంటు లోడులను తెప్పించేందుకు వెనుకాడటం లేదు. ప్రభుత్వానికి పన్ను ఎగవేసే ప్రయత్నంలో భాగంగా నేరుగా బిల్టర్ల, పెద్ద కాంట్రాక్టర్లకు రాత్రికి రాత్రి లోడును పంపుతున్నట్లు తెలుస్తోంది.

కట్టిన ఇళ్ల వైపు సామాన్యుడి చూపు..

నిర్మాణ వ్యయం పెరగడం, ఇంటి నిర్మాణం దగ్గరుండి చూసుకునే సమయం లేని వారు కట్టిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగాలు, ఇతరత్రా వ్యాపారాలలో బిజీగా ఉన్న వారు ఒక నిర్ణీత ధరకు ఇళ్లను కట్టి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని బిల్టర్‌కే ఇచ్చేస్తున్నారు. మరి కొంతమంది కట్టి రెడీగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేసి ఇంటీరియర్‌ మాత్రం వారికి నచ్చిన విధంగా చేయించుకుంటున్నారు.

మరోవైపు అపార్‌ ్టమెంట్‌లలో ప్లాటు తీసుకునేందుకు మధ్య తరగతి వారు, సామాన్యులు మొగ్గు చూపుతున్నారు. వంద గజాల్లో ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవుతుండగా.. రెండు బెడ్‌ రూంలు ఉన్న ప్లాట్‌ రూ. 40 లక్షలకు వస్తుండడంతో సామాన్య, మధ్య తరగతి వారు అపార్ట్‌మెంట్‌ల కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీ ంతో ఇటీవల రాష్ట్రంలోని పలు నగరాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం విపరీతంగా పెరిగిపోయింది.

వైఎస్సార్‌ జగనన్న ఇళ్లతో..

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలతో పేద ప్రజలు కాస్త సొంతింటి కల నెరవేరిందని చెప్పవచ్చు. రాష్ట్రం లో 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఇళ్లను నిర్మించుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం 71,811,49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్లాట్‌ విలువ రూ. 2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతున్న నేపథ్యంలో.. పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల విలువ రూ.76,000 కోట్ల కు పైమాటే ఉంటుంది.

ఇంత ఖరీ దైన స్థలాలను పేదలకు ఉచితంగానే పంపిణీ చేసిన ప్రభుత్వం అక్కడితో సరిపెట్టుకోకుండా ఇళ్ల నిర్మాణాలకు యూనిట్‌కు రూ. 1.80 లక్షలు బిల్లు మంజూరు చేసింది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన పేద మహిళలకు పావలా వడ్డీకి రూ. 35 వేల రుణ సాయం కూడా ప్రభుత్వం చేసింది. ఇలా ప్రభుత్వ సాయంతో నిర్మితమైన ఇళ్లు రాష్ట్రంలో 5,85,829 ఉన్నాయి.

రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టడం, అనేక చోట్ల గృహ ప్రవేశాలు జరగడంతో సామాన్య, పేద ప్రజలు ఊహించని సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఆర్థిక ఇబ్బందులతో ఇంటి స్థలం కూడా సమకూర్చుకోలేని వారంతా ఇప్పుడు సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.

ఇన్నాళ్లూ అద్దె ఇళ్లల్లోనే నెట్టుకొస్తున్న అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు ఎ వరికి కోసం వచ్చినా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చేది. అటువంటి ఇబ్బందుల నుంచి సొంతింటిలోకి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.కోట్ల రూపాయలు ఖర్చుచేసి సొంతింటి కళను సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement