Monday, November 25, 2024

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నైవేద్యాలు, ప్రసాదాలకు సేంద్రీయ ఉత్పత్తులు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో నైవేధ్యాలు, లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం తయారు చేసేందుకు సేంద్రీయ ఉత్పత్తులను వినియోగించాలని నిర్ణయించారు. ఈ విషయమై మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేంద్రీయ ఉత్పత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాది టీటీడీ రైతు సాధికార సంస్థ మధ్య జరిగిన ఒప్పందంలో రసాయన రహిత సహజ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను స్వామివారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం తయారీకి అవగాహన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 2021లో 1304 మెట్రిక్‌ టన్నుల సేంద్రీయ వ్యవసాయంతో పండించిన పచ్చి శెనగపప్పును టీటీడీకి సరఫరా చేయడం జరిగింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణంపై టీటీడీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 2022- 23 సంవత్సరానికి నైవేధ్యం ప్రసాదం, అన్న ప్రసాదానికి అవసరమైన 12 రకాల సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేయాలని టీటీడీ రైతు సాధికార సంస్థను అభ్యర్థించింది.

టీటీడీ అభ్యర్థన మేరకు రైతు సాధికార సంస్థ 12 రకాల సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో 24 వేల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం ద్వారా రసాయన రహిత సహజ ఉత్పత్తులను పండిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తీ, కాణిపాకం, శ్రీశైలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, మహానంది, కసాపురం దేవాలయాల్లో కూడా నైవేధ్యాలు, ప్రసాదాల తయారీకి సేంద్రీయ ఉత్పత్తులను వినియోగించాలని మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రులు, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో టీటీడీ అనుసరిస్తున్న విధానాలను, సౌకర్యాలను మిగిలిన దేవాలయాల్లో కూడా కల్పించాలని సమావేశంలో మంత్రులిద్దరూ నిర్ణయించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ టి. విజయ్‌ కుమార్‌, దేవాదాయ శాఖ కమీషనర్‌ హరి జవహర్‌ లాల్‌, మార్కెటింగ్‌ శాఖ ఎండీ ప్రద్యుమ్న, కె. రామారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement