Friday, September 20, 2024

Dussehra | ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం : ఆనం

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3 వ తేదీ నుండి తొమ్మిది రోజులపాటు శ్రీ కనకదుర్గమ్మ వారు భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు.

అశేష సంఖ్యలో తరలివచ్చే ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం శీఘ్రముగా అయ్యే విధంగా అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖ అధికారుల సమన్వయంతో పనులను వేగవంతం చేస్తున్నారు. దేశం నలుమూలల నుండి సుమారు 15 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావచ్చని అంచనా నేపథ్యంలో దానికి అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ మంగళవారం విడివిడిగా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. దేవస్థానం అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు సలహాలు అందజేశారు.

సమన్వయంతో విజయవంతం చేయాలి

అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా నిర్వహించు దసరా మహోత్సవములు పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్ ఎస్ సత్యనారాయణ దుర్గ గుడి కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు, దేవాదాయ శాఖ అదనవు కమీషనర్ కె రామచంద్ర మోహన్, సిఈ శేఖర్ కలిసి దేవస్థానం లో భక్తుల సౌకర్యార్థం చేస్తున్న దసరా ఏర్పాట్లు గురించి వివరించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు మొదటి ప్రాధాన్యత నిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం జరిగేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని, ప్రభుత్వమునకు మంచి పేరు తెచ్చేలాగా గతములో కంటే చాలా మెరుగుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడా అలసత్వం కు చోటు లేకుండా పటిష్టముగా ఏర్పాట్లు ఉండాలని సూచనలు చేశారు.

అంతకుముందు కమిషనర్ సత్యనారాయణకు ఈవో కేఎస్ రామారావు అధికారులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల గురించి జరుగుతున్న ఏర్పాట్లను పూర్తిస్థాయిలో వివరించారు. ఈ సమీక్ష సమావేశం లో ఆలయ వైదిక సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వరరావు, లింగం రమాదేవి , ఏఈఓలు ఎన్ రమేష్, పి చంద్రశేఖర్, సుధారాణి, బి వెంకటరెడ్డి, జే శ్రీనివాస్, ఆలయ డిఈ లు, ఏఈఈ లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement