వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇటీవల భారీగా వైద్యులు, సిబ్బంది నియామకాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చింది. ఏపీ వైద్యవిధాన పరిషత్‌లో భారీ నియామకాలకు ఆదేశాలిచ్చింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న 2588 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. 446 మంది సర్జన్, అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నారు. వీరందరినీ శాశ్వత ప్రాతిపదికన నియమించనున్నారు.
అలాగే మిగిలిన ఇతర పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన నియామకాలన్నీ ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే బదిలీ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో మరో భారీ రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..