అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. మొత్తం 30 లక్షల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఫేజ్1, ఫేజ్ 2 లలో 18 లక్షల ఇళ్లను కట్టాలనుకుంది. కానీ ఇప్పటికి 1,67,739 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణాన్ని 2020లోనే ప్రారంభించగా ఇప్పటికి రెండున్నర ఏళ్లు గడిచిపోతున్నా ఇంతవరకు పది శాతం ఇళ్లు కూడా పూర్తవ్వలేదు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వర్షాలు, ఇతర కారణాల వల్ల ఆ లక్ష్యం కూడా నెరవేరడం లేదు. కాగా ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం మూడు అప్షన్ల కింద విభజించింది. ఒకటో అప్షన్‌లో ఇంటి నిర్మాణానికి మేటీరియల్‌ను ప్రభుత్వమే అందిస్తుంది. కార్మికుల కూలి మాత్రం నగదు చెల్లిస్తారు. రెండో అప్షన్‌లో మెటీరియల్ మొత్తం లబ్దిదారుడే కొనుగోలు చేసి ఇళ్లు కట్టించుకుంటాడు. అతనికి ఇళ్ల పథకం ద్వార వచ్చే లక్షా 80 వేల రూపాయలు, బ్యాంక్ రుణం 35 వేల రూపాయలను ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తుంది. ఇక మూడో అప్షన్ ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి ఇస్తుంది. ఈ మూడో అప్షన్ కింద ఇచ్చిన ఇళ్ల నిర్మాణం నత్తనడక కన్నా ఘోరంగా నడుస్తోంది.
నత్తనడక కన్నా మెల్లగా అప్షన్-3 ఇళ్లు…
అప్షన్-3 ఇళ్లు మరీ నత్తనడక కన్నా మరీ మెల్లగా సాగుతోంది. మొత్తం 18 లక్షల 63 వేల ఇళ్లలో మూడు లక్షల 27 వేల మంది మూడో అప్షన్‌ను ఎంచుకున్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. కానీ పని వేగంగా సాగడం లేదు. మొత్తంగానే ఇళ్ల నిర్మాణం వేగంగా లేదు అంటే ప్రత్యేకంగా అప్షన్ 3 ఇళ్ల నిర్మాణం మరింత ఘోరంగా ఉంది. ప్రతి సమీక్షా సమావేశంలో సిఎం ఈ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సిఎం చెబుతూనే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం పని జరగడం లేదు. ఇప్పటికి కేవలం రెండు ఇళ్లు మాత్రమే పూర్తికాగా, రెండు ల క్షల 60 వేల ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ కూడా దాటలేదు. బేస్‌మెంట్ లెవల్‌లో 68 వేల ఇళ్లు మాత్రమే ఉండగా, రూఫ్ లెవల్‌లో కేవలం 2100 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. సాధరణంగా ప్రభుత్వ పథకం కింద ఇచ్చే 2,15,000 రూపాయల ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోదు. ఇళ్లు కట్టుకుంటున్నవాళ్లంతా మరో రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కానీ ఎటువంటి ఆర్ధిక ఆసరగా లేని వారు, డబ్బులు అప్పు పుట్టని వారు, వితంతులు, వృద్దులు అప్షన్ 3 ఎంచుకున్నారు. వీరికి ఇళ్లు నిర్మాణం జరగడం లేదు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద పెద్ద పెద్ద కాలనీలు ఉన్న చోట మాత్రమే ఇళ్లు కట్టేం దుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. అప్షన్ 3 కింద అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇళ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే వీటి నిర్మాణంలో జాప్యం జరగుతోందని ప్రభుత్వం చెబుతోంది.