నెల్లూరు, (ప్రభ న్యూస్): రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు సోమవారం జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మత్తు పదార్థాల నియంత్రణ లక్ష్యంగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. నాకా బందీ నిర్వహించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు స్వయంగా పాల్గొన్నారు. గంజాయి, నిషేధిత గుట్కా, అనధికార మద్యం, పొరుగు రాష్ట్రాల మద్యం, మాదక ద్రవ్యాలను నియంత్రించే దిశగా ఎస్పీ విజయరావు, పోలీసు బృందాలు, సెబ్ అధికారులు సంయుక్తంగా సోమవారం నెల్లూరు ఆర్‌టీసీ బస్టాండ్, రైల్వేస్టే షన్, ఆత్మకూరు బస్టాండ్‌లలో పార్శిల్ విభాగాలు, గోడౌన్లలో తనిఖీలు నిర్వహించారు.
అనంతరం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన నాకా బందీలో ఎస్పీ సీహెచ్ విజయరావు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద స్వయంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాల అక్రమరవాణా అడ్డుకట్టకు డీజీపీ ఆదేశాలతో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వారం రోజులుగా జిల్లాలో నాకా బందీ నిర్వహిస్తూ వాహనాల తనిఖీ చేస్తున్నామని అన్నారు. ఈ తనిఖీలలో ఇప్పటివరకు 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 20 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు.
వారిలో 16 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు కాగా.. ఇద్దరు కర్నాటక, మరో ఇద్దరు విశాఖపట్నం వాసులని తెలిపారు. అదేవిధంగా ఈ తనిఖీల్లోనే సెల్‌ఫోన్ దొంగల ముఠా గుట్టు రట్టయిందన్నారు. 228 సెల్‌ఫోన్ల ను స్వాధీనపరుచుకుని ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని, మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
దేశ భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉంది, అటువంటి యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటుంన్నారు అని అన్నారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల మనిషి విచక్షణ కోల్పోయి నేరాలు, ఘోరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఫ్యాషన్‌గా మొదలయ్యే ఈ మత్తు చివరకు యువతను అదే మత్తుకు బానిసగా చేసి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుస్తుందని అన్నారు.
మత్తు పదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చకుండా యువత మేల్కోవాలన్నారు. ఈ నాకా బందీ కార్యక్రమంలో ఏఎస్పీ పి వెంకటరత్నం, సెబ్ జేడీ శ్రీలక్ష్మి, డీఎస్పీలు ఎన్ కోటారెడ్డి, జె శ్రీనివాసులురెడ్డి, హరనాధ్‌రెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజగోపా ల్‌రెడ్డి, ఎండీ అబ్దుల్ సుబాన్, ఎం గాంధీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అక్కేశ్వరరావు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.