జిల్లా యంత్రాంగం నివేదిక అందించాలని కోరిన ప్రభుత్వం
వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
సర్వే నెంబర్లతో సహా వివరాలు సేకరించాలి
క్షేత్రస్థాయిలో పర్యటించాలి
భవిష్యత్ లో బుడమేరును ముంపు నుంచి రక్షించాలి
ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి
రివ్యూ మీటింగ్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన
ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో : ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన అన్నారు. ఆక్రమణలను గుర్తించేందుకు తొలిదశలో తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సర్వే, భూ రికార్డులు, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సృజన భేటీ అయ్యారు. భవిష్యత్ లో బుడమేరు వరద ముంపునకు గురికాకుండా ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరును చేపట్టిందని.. ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించాలని ఆదేశించిందన్నారు. బుడమేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు.
సర్వే, ల్యాండ్ రికార్డ్స్ పై ఇరిగేషన్, వీఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. సర్వే నంబర్లతో సహా ఆక్రమణలపై పూర్తి నివేదికను సత్వరం సమర్పించాలన్నారు. ఇటీవల బుడమేరు పరీవాహక ప్రాంతంలో కురిసిన కుంభవృష్టితో ఊహించని విధంగా పెద్ద ఎత్తున దాదాపు 40వేల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. పంట పొలాలు మునిగిపోయాయని, విజయవాడ నగరంలో రెండు లక్షలకు పైగా కుటుంబాలు తీవ్రనష్టాన్ని చవిచూశాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు పది రోజులకు పైగా కలెక్టరేట్‌లోనే ఉండి.. బుడమేరు గండ్లను పూడ్చడం, బాధితులను పరామర్శించి, పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆపరేషన్ బుడమేరును ప్రకటించారని.. ఈ నేపథ్యంలో బుడమేరు ఆక్రమణలపై నివేదికలను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.