శ్రీకాకుళం, జనవరి 23 (ప్రభన్యూస్): సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి జరగలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించడం విడ్డూరంగా ఉందని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపించాలంటూ తమ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి సవాళ్ళు విసురుతుండం విచిత్రంగా ఉందన్నారు.
ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూపించడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పుడు ఆమె ఇచ్చాపురం వెళ్తున్నప్పుడు పలాసలో వైఎస్ జగన్ ప్రారంభించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి దాటుకునే వెళ్ల్లారని, తల పక్కకి తిప్పి చూసి ఉంటే అది కనిపించి ఉండేదన్నారు. ఇక ఉద్దానంలో 700 కోట్ళ రూపాయలతో సుజల స్రవంతిని ఏర్పాటుచేశారని, ఇచ్చాపురంలో ప్రసంగాలు చేసిన ఆమెకు అది కూడా కనిపించ లేదని అన్నారు. ఆమె టెక్కలి దాటుకునే వెళ్లారని అక్కడ సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అది కూడా ఆమెకు కనిపించలేదన్నారు. చంద్రబాబు మాయ నుంచి బయటపడితే అన్నీ బాగా కనిపిస్తాయని ఆమెకు హితవుచెప్పారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో సంక్షేమం అన్ని రంగాల్లో కనిపిస్తోందన్నారు. అన్నివిధాలుగా జగన్ మహిళలకు అండగా నిలిచారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం..ఇలా అన్ని రంగాల్లో సంక్షేమం అమలవుతోందని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది..ఇది కూడా కనిపించలేదా? అని ప్రశ్నించారు. చెప్పుడుమాటలు వింటే ఈ అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో ధర్మాన కృష్ణదాస్ తో పాటు ఎంఎల్సీ నర్తు రామారావు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఇతర నాయకులు ఉన్నారు.