Saturday, November 23, 2024

ప్రతిష్ఠంభనకు తెరదించండి : సీఎం కు సీపీఎం శ్రీనివాసరావు లేఖ


అమరావతి : రాష్ట్ర ప్రభుత్వద్యోగులకు 11వ పిఆర్‌సి ఫిట్‌మెంట్‌పై ప్రతిష్టంభన కొనసాగుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం ఆయ‌న‌ లేఖ రాశారు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా జాప్యం చేయడం వల్ల క్రింది స్థాయిలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిర్వహిస్తున్న చర్చలతో మరింత జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మీరే స్వయంగా చర్చలు జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పిఆర్‌సి ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు. చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ నివేదికలోని సిఫార్సులపై ఉద్యోగ సంఘాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే వారు 27శాతం ఇంటీరమ్‌ రిలీఫ్‌ తీసుకొంటున్నారు. అంతకన్నా ఎక్కువ ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరుగుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో సిఎస్‌ కమిటీ 14.29శాతం మాత్రమే సిఫార్సు చెయ్యడంపైన ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. దీనికి తోడు ఇంటి అద్దెల కుదింపు, సిసిఎ రద్దు, పిఆర్‌సి కాలాన్ని పొడగించడం వంటి సిఫార్సులపైనా అసంతృప్తి ఉంద‌న్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రెగ్యులర్‌గా పిఆర్‌సిలు ప్రకటించి ఉంటే ప్రస్తుతం 13వ పిఆర్‌సి అమలు కావాలన్నారు.

కానీ జరిగిన జాప్యం వలన ఉద్యోగులు10 సంవత్సరాలు అనగా 2 పిఆర్‌సిల కాలాన్ని కోల్పోయారన్నారు. ప్రస్తుతం 11వ పిఆర్‌సిలోనైనా పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు తగిన విధంగా వేతన పెంపు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల ముందు మీరు పిఆర్‌సి వెంటనే ఇస్తామని, సిపిఎస్‌ రద్దు చేస్తామని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లిస్తామని, వారిని రెగ్యులరైజ్‌ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చెయ్యాల్సింది ఉద్యోగులేనని పేర్కొన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఈ కృషిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, టైంస్కేల్‌, కంటింజెంట్‌, డైలీవేజ్‌ ఉద్యోగులు కూడా పాలుపంచుకొంటున్నారన్నారు. వీరందరికీ సకాలంలో పిఆర్‌సి అమలు చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో పై ఉద్యోగుల అన్ని సంఘాల నాయకులతో మీరే స్వయంగా వెంటనే చర్చలు జరిపి పిఆర్‌సి, ఇతర సమస్యలను పరిష్కరించమని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement