అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర సార్వత్రిక విద్యా పరిషత్ (ఓపెన్ స్కూల్స్ సొసైటీ) విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్‌మీడియెట్ పరీక్షా ఫలితాల్లో బాలికలే టాప్‌గా నిలిచారు. పదో తరగతిలో 55.43శాతం, ఇంటర్ మీడియెట్‌లో 63.19శాతంతో బాలల కంటే ముందంజలో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పది, ఇంటర్ ఫలితాలను విడుదల చేయగా.. గత మేలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలను ఓపెన్ స్కూల్స్ సొసైటీ శుక్రవారం విడుదల చేసింది. పదో తరగతిలో 52.64శాతం, ఇంటర్‌లో 60.40శాతంతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో 32వేల 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 16వేల 866 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మీడియెట్‌లో మొత్తం 49వేల 238 విద్యార్థులు పరీక్ష రాయగా 29వేల 742 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులైన బాలల శాతం 49.25శాతం కాగా బాలికల శాతం 55.43గా ఉంది. ఇంటర్ మీడియెట్ ఫలితాల్లో బాలల ఉత్తీర్ణతా శాతం 57.81 కాగా బాలికల శాతం 63.19గా ఉంది. పదో తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లా 84.52శాతంతో మొదటి స్థానంలో నిలవగా 6.60శాతంతో అనంతపురం జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. ఇంటర్‌లో నెల్లూరు జిల్లా 81.53శాతంతో మొదటి స్థానంలో ఉండగా 25.16శాతంతో అనంతపురం జిల్లా ఆఖరి స్థానంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తగిన రుసుము చెల్లించి పది, ఇంటర్ విద్యార్థులు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు అవకాశం కలిపించారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం ఆగస్టు 3నుంచి 11వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పదో తరగతి, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఇంటర్ మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఆగస్టు 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులు ఈ నెల 27వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.