Tuesday, November 19, 2024

Opration Boat – రంగంలో సుబ్బయ్య బృందం…

క‌ష్ట‌త‌రంగా బోట్ల తొల‌గింపు
భారీ ప‌డ‌వ‌ల సాయంతో తొల‌గించే ప్ర‌య‌త్నం
మూడో రోజు ప్లాన్ సీ రెస్క్యూ ఆపరేషన్
రంగంలో కాకినాడ సుబ్బయ్య బృందం

( ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో ) వరద నీటిలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది. ఈ బోట్లను తొలగించటానికి అధికారులు ప్లాన్‌ల మీద ప్లాన్‌లు డిజైన్ చేస్తున్నారు. కానీ ప్లాన్‌లు ఫలితం ఇవ్వటం లేదు. గడిచిన మూడు రోజులుగా ఈ బోట్లను తొలగించేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు.


ఈ నెల 1వ తేదీన కృష్ణా నదికి వచ్చిన భారీ వరద నీటితో అయిదు పడవలు బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చాయి. బ్యారేజీ గేట్ల కామర్చిన కౌంటర్ వెయిట్లను ఢీకొనడంతో అవి దెబ్బ తిన్నాయి. వరద నీటిలో కొట్టుకువచ్చిన ఐదు బోట్లలో మూడు భారీవి కాగా ఒకటి మధ్యస్థంగా, మరొకటి చిన్న బోటుగా ఉంది. చిన్నదిగా ఉన్న ఒక బోటు గేట్ల ద్వారా భారీ నీటి ప్రవాహంతో కిందకి కొట్టుకుపోయింది. గేట్లకు అడ్డంగా ఉన్న బోట్లను తొలగించేందుకు మొదటి రోజు భారీ క్రేన్ల సహాయంతో బోల్తా కొట్టిన పడవలను యధాస్థితికి తీసుకువచ్చి బ్యారేజీ దిగువ‌కు నెట్టి వేసేందుకు ప్రయత్నించారు. గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ పని సాగలేదు.

- Advertisement -


మరో ప్లాన్‌లో భాగంగా రెండో రోజు నీటిలో చిక్కుకున్న బోట్లను రెండుగా కట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఇంజనీర్లు సహాయంతో గ్యాస్ కట్టర్లతో బోట్లను రెండు భాగాలుగా విడగొట్టేందుకు సుమారు 12 అడుగుల లోతులోకి వెళ్లి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరి ప్రయత్నం గా భారీ పడవల సహాయంతో ఈ బోట్లను తొలగించే ప్రయత్నాలను శుక్రవారం ప్రారంభించారు. ఇందుకోసం కాకినాడ కు చెందిన సుబ్బయ్య బృందం రంగంలోకి దిగింది. 14 సభ్యుల ఈ బృందం 50 టన్నులకు పైగా ఉన్న భారీ ఏడు పడవల సహాయంతో బోట్ల తొలగింపును ప్రారంభించారు. భారీ పడవల సహాయంతో కృష్ణానది ఎగువ ప్రాంతానికి ఈ బోట్లను లాగే ప్రయత్నాలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రానికి ఈ బోట్లను ఒడ్డుకు చేర్చుతారని ఇంజనీర్లు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement