కలమట సహకారం అవసరం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ఏడు నియోజకవర్గాల్లో విజయాల్లోనూ విజయం సాధిస్తాం
ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు
చంద్రబాబు సముచిత స్థానం కల్పించారు.. జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ
శ్రీకాకుళం, ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని వదిలించుకుందామని ఎదురు చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్‌మోహనరెడ్డి భ్రష్టు పట్టించారన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన యాత్ర బస్సు కాదని.. అది తుస్సు యాత్ర అని పేర్కొన్నారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన చూపిస్తే మరో అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని నరకకూపంగా మారుస్తారని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని వివరించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ… జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోనూ, పార్లమెంట్ పరిధిలోని ఏడు సిగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉండడంతో అనేక మంది పదవులకు త్యాగం చేశారని, అందులో కలమట వెంకటరమణ చేసిన త్యాగం చారిత్రాత్మకమైనదన్నారు.
నారా చంద్రబాబునాయుడు కలమట వెంకట రమణ అవసరాన్ని గుర్తించే పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కలమట వెంకటరమణ మాట్లాడుతూ… అందరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. టిక్కెట్ కేటాయించక పోవడంతో కాస్త మనస్థాపానికి గురైనప్పటికీ, చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించారన్నారు. వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తప్పనిసరిగా జిల్లాలో నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, ముఖ్యనేతలు బోయిన గోవిందరాజులు, పడాల భూదేవి, చౌదరి బాజ్జి, కలమట సాగర్, ఖండాపు వెంకటరమణ, మాదారపు వెంకటేష్, పీఎంజె బాబు, సింతు సుధాకర్, గుత్తు చిన్నారావు, మెండ దాసునాయుడుతో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.