Tuesday, November 26, 2024

Big Story | ప్రభుత్వ మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఎట్టకేలకు మద్యం షాపుల్లో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో..ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు మద్యం షాపుల్లో యూపీఐ ఆధారిత పేమెంట్లు మొదలు పెట్టారు. రాష్ట్రంలోని 15 మద్యం షాపుల్లో నాలుగు నెలల కిందట తొలి విడత యూపీఐ ఆధారిత అమ్మకాలు చేపట్టారు. తొలి విడతలో మొదలు పెట్టిన అధికారులు మిగిలిన షాపుల్లో ఈ తరహా అమ్మకాలపై జాప్యం చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే రెండు నెలల రాబడి శాఖల సమీక్షా సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే యూపీఐ ఆధారిత అమ్మకాలు చేపట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో అధికారులు నగదు రహిత లావాదేవీలు చేపట్టారు.

- Advertisement -

ఎప్పటి నుంచో డిమాండ్‌..

మద్యం షాపుల్లో నగదు రహిత లావాదేవీలపై ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లలో సైతం యూపీఐ ఆధారిత పేమెంట్లను అనుమతిస్తుండగా రూ.లక్షల వ్యాపారం జరిగే షాపుల్లో లేకపోవడమేంటని పలువురు విమర్శలు చేశారు. విపక్ష పార్టీలైతే మద్యం షాపుల్లో అమ్మకాల నగదులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయే విమర్శలను పెద్ద ఎత్తున చేశాయి. టీడీపీ, బీజేపీ సహా వివిధ రాజకీయ పక్షాలు మద్యం అమ్మకాలపై పలు సందేహాలు కూడా వ్యక్తం చేశాయి. రేట్లు పెంచి మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు తక్కువ మొత్తంలో జమ చేస్తున్నారంటూ ఆయా పక్షాలు మండిపడ్డాయి.

గత మూడున్నరేళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వీటికి చెక్‌ పెట్టేందుకు నిర్ణయించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసింది. వివిధ సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరిపిన మీదట యూపీఐ పేమెంట్లకు మార్గం సుగగమం చేసింది. తొలి విడతలో విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 15 మద్యం షాపుల్లో యూపీఐ ఆధారిత పేమెంట్లను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ భార్గవ, ఏపీబీసీఎల్‌ ఎండీ డీ.వాసుదేవరెడ్డి ప్రారంభించారు. అమలులో లోటుపాట్లను సవరించుకొని అన్ని షాపుల్లో ప్రారంభించనున్నట్లు గతంలోనే అధికారులు స్పష్టం చేశారు.

అన్ని మద్యం షాపుల్లో..

రాష్ట్రంలో 2,934 మద్యం షాపులు ఉన్నాయి. ఇవి కాక వాక్‌ ఇన్‌ స్టోర్స్‌, పర్యాటక ప్రాంతాల్లో కలిపి మరో ఎనిమిది వందల షాపుల వరకు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు యూపీఐ పేమెంట్లను అనుమతిస్తున్నారు. ఎక్కడో తక్కువ అమ్మకాలున్న ప్రాంతాల్లో ఒకటి అరా మినహా అన్ని మద్యం షాపుల్లో యూపీఐ పేమెంట్లను అనుమతిస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల్లో యూపీఐ పేమెంట్లు అనుమతించడం పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఎప్పటి నుంచో ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతిస్తున్నారు.

ప్రైవేటు నిర్వహణలోని బార్లలో అనుమతిస్తూ ప్రభుత్వ షాపుల్లో అనుమతించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా చిన్నపాటి తోపుడు బండ్లలో సైతం యూపీఐ పేమెంట్లను అనుమతించడాన్ని పేర్కొంటూ అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వ మద్యం షాపుల్లో యూపీఐ పేమెంట్లు అనుమతించడం ముదాహవమని పలువురు పేర్కొంటున్నారు. అయితే రద్దీ సమయాల్లో కొందరు మద్యం షాపుల ఉద్యోగులు ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతించడం లేదనే విమర్శలు అక్కడక్కడా వినబడుతున్నాయి. ఇందుకు సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నారు. అధికారులు వీటిపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

నగదు అక్రమాలకు అడ్డుకట్ట..

ఆన్‌లైన్‌ పేమెంట్లతో మద్యం షాపుల్లో నగదు అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున నగదు దుర్వినియోగం జరిగింది. ఎన్‌టీఆర్‌, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సహా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉద్యోగులు మద్యం అమ్మకాల నగదు సొంతానికి వాడుకున్నారు. ఎన్‌టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మద్యం షాపులో రూ.లక్షల్లో నగదు వాడకం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో పలు షాపుల్లో రూ.లక్షల్లో నగదును ఉద్యోగులు సొంతానికి వాడుకున్నారు.

వీరిలో పలువురిపై క్రిమినల్‌ కేసులు కూడా పెట్టారు. కొంత మంది నుంచి నగదు రికవరీ పెట్టినప్పటికీ పోయిన దానితో పోల్చితే రికవరీ శాతం తక్కువేనని చెప్పొచ్చు. నగదు అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ ఇవ్వాలంటూ అధికారులు నిబంధనలు కూడా పెట్టారు. మరో అడుగు ముందుకేసి యూపీఐ లావాదేవీలు అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున జరిగే నగదు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement