అమరావతి, ఆంధ్రప్రభ : రెండు నెలలకుపైగా కొండెక్కిన టమాటా ధరలు ఒక్కసారి దిగిరాగా.. ఇప్పుడు ఉల్లి జనాలను కలవరానికి గురిచేస్తోంది. గతవారం నుంచి ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల్లోనే కిలోకు రూ.10 మేర పెరగడం గమనార్హం. రైతు బజార్లలో కిలో రూ. 30 వరకు పలుకుతుండగా, మాల్స్, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో రూ. 35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే కిలోకి సగటున 150 శాతంపైగా ధర పెరగడం గమనార్హం. రాష్ట్రంలో సాగు విస్తీరణం తగ్గడం ఉత్పత్తిపై ప్రభావం చూపింది. అటు, పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ కొత్త పంట ఇంకా చేతికి రాలేదు. ఈనేపథ్యంలో ఉల్లి ధరలు పైపైకి వెళ్తున్నాయి.
మరోవైపు ఉల్లి ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబరు చివరి వరకూ ఎగుమతులపై కేంద్రం 40 శాతం సుంకం విధించింది. నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్‌లో అందుబాటులోకి తేవడంతో కొంతమేర ఉపశమనం లభిస్తోంది. అయినా సరే ధరలు పెరుగుదల ఆగలేదు. నిన్నమొన్నటి వరకూ టమాటాలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. కొన్ని రాష్ట్రాల్లో కిలో రూ.250 వరకూ చేరింది. పంట ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.25 నుంచి రూ.35 చొప్పున అమ్ముతున్నారు. దాని స్థానంలోకి ఇప్పుడు ఉల్లి చేరుతుందేమోనని వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.
గణనీయంగా తగ్గిన ఉల్లి సాగు
వరుసగా మూడేళ్ల నుంచి పంట దెబ్బతినడంతో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఉల్లి సాగు భారీగా తగ్గింది. దీంతో మార్కెట్‌కు సరుకు రావడం లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఈ సమయంలో రోజుకు 80 నుంచి 90 లారీలు వచ్చేవి. ఇప్పుడు ఒకటి రెండు లోడులకు మించి రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు వారాల నుంచి నాఫెడ్ ద్వారా రోజుకు 15 లారీల వరకు ఉల్లి సరఫరా అవుతోంది. కర్నూలు ఉల్లి మార్కెట్ పరిస్థితీ ఇంతే. సరుకు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది.
ధర పెరిగిందిలా..
ఇక, ఈ ఏడాది మార్చిలో కిలో ఉల్లి రూ.15 ఉండగా సెప్టెంబరు నాటికి ధర రెండింతలయ్యింది. విజయవాడ రైతు బజార్‌లో కిలో రూ. 30 చొప్పున ఉంది. చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణాతోపాటు వివిధ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కిలో రూ. 40 పైగా విక్రయిస్తున్నారు. నాఫెడ్ ఉల్లితో పోలిస్తే మార్కెట్‌లోకి వచ్చే ఉల్లి నాణ్యంగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు వివరిస్తున్నారు. అందుకే ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. కిలో ఉల్లి రూ. 60 నుంచి రూ 70కి చేరినా ఆశ్చర్యపడక్కర్లేదని అంటున్నారు. ఉత్పత్తి, డిమాండ్ మధ్య ఉన్న అసమతౌల్యం కారణంగా ఉల్లి ధర పెరిగే అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది.