ఒంగోలు క్రైం, (ఆంధ్రప్రభ): ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం అర్ధరాత్రి ప్రయాణికుడి వీపు పై పోలీసు లాఠీ వీరంగం ఆడింది. ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించడం అతని నేరం అయింది. ఈ దారుణాన్ని భరించలేని తోటి ప్రయాణికులు పోలీసులను నిలదీయడంతో తెల్ల మొఖాలు వేయడం పోలీసుల వంతు అయ్యింది.
వివరాల్లోకి వెళితే బి నిడమానూరు గ్రామానికి చెందిన పిడతల మార్క్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం వ్యవసాయానికి ఉపయోగించుకునే ట్రాక్టర్ మరమ్మతులు చేయించుకునేందుకు ఒంగోలు వచ్చాడు. మరమ్మతులకు మెకానిక్ కి ఇవ్వడంతో సాయంత్రం అయినా పని పూర్తి కాలేదు. ట్రాక్టర్ మరమ్మత్తుల పనిలో నిమగ్నమైన ఆయన ఊరికి వెళ్లే ఆఖరి బస్సు విషయాన్ని మర్చిపోయాడు. ఇంతలో సాయంత్రం పొద్దు పోవడంతో ఇంటికి వెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్నాడు. రాత్రి సుమారు 7:30 గంటల తరువాత ఆయన వెళ్లే ఊరికి బస్సు సర్వీసు లేదని తిరిగి ఉదయం నాలుగు గంటలకి ఫస్ట్ బస్సు బయలుదేరుతుందని తెలుసుకున్నాడు. ఉదయం ఫస్ట్ బస్ కి ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకుని బస్టాండ్ లో వేచి ఉన్నాడు.
ఇంతలో సెల్ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో అక్కడే బస్టాండ్ లో అతని దగ్గర ఉన్న చార్జర్ సాయంతో చార్జింగ్ పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ లో గస్తీకాస్తున్న హోంగార్డు మార్కు వద్దకు వచ్చాడు. ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించాడు. దానికి సమాధానంగా మార్కు ఎందుకు అలా అంటున్నారు చక్కగా మాట్లాడండి అంటూ వారించటంతో హోంగార్డు కు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. నన్ను ఎదిరిస్తావా అంటూ చేతిలో ఉన్న లాఠీతో విచక్షణారహితంగా మార్కుపై దాడికి దిగాడు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న తోటి ప్రయాణికులు దాడి చేస్తున్న హోం గార్డ్ ను అడ్డుకున్నారు. ఏ నేరం చేసాడు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాం అంటూ నిలదీయడంతో బస్టాండ్ ఆవరణలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇంతలో అక్కడకు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ రాత్రి గస్తీకి తిరిగే పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడిన హోంగార్డును అక్కడి నుండి తప్పించి బాధితుడుని స్టేషన్కు రావాలంటూ తెలియజేశారు. పోలీసుల మాటలకు చుట్టూ ఉన్న తోటి ప్రయాణికులు అడ్డం తిరిగారు.
దాడికి పాల్పడిన హోం గార్డ్ స్టేషన్లో ఉన్నాడు ఇతనిని కూడా స్టేషన్ కి తీసుకురావాలని పై అధికారులు మాకు ఆదేశాలు జారీ చేశారంటూ అక్కడనుండి మార్కును పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి నుండి తెల్లవారి వరకు బాధితుడుని స్టేషన్ లో ఉంచి తెల్లవారి ₹10 చేతులో పెట్టి బుజ్జగించి ఇంటి బాట పట్టించారు.
అయితే మార్క్ ఒంటిపై ఉన్న దెబ్బలు చూపిస్తూ ఒక మనిషిని ఇలా దుర్మార్గంగా కొడతారా అంటూ అర్ధరాత్రి బస్టాండ్ లో జరిగిన తతంగంతో కూడిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.
అతను మద్యం సేవించి దుర్భాషలాడాడు
అర్ధరాత్రి ప్రయాణికుడి పై దాడి ఘటన పై ఒకటో పట్టణం ఇన్స్పెక్టర్ నాగరాజును వివరణ కోరగా ఆయన స్పందించారు. మద్యం మత్తులో ఉన్న మార్క్ డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడంటూ దీంతో వారిద్దరు మధ్య వాగ్వివాదం జరిగి హోంగార్డు తొందరపడ్డాడు అంటూ వివరణ ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళామని తెలియజేశారు. ఘటనపై విచారిస్తున్నామని తప్పు చేసిన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేశారు.