దోచుకోవటం దాచుకోవటమే వారికి తెలుసు
బాబు వస్తే ఉద్యోగాలు రావు
సంక్షేమ పథకాలు ఉండవు
పెన్షన్ల పంపిణీలోనూ కుట్ర
పేదల భవిష్యత్తు అంధకారమే…
ఇంటింట అభివృద్ధి వైసీపీతోనే
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి
టంగుటూరు సభలో సీఎం జగన్
ఆంధ్యప్రభ, ఒంగోలు బ్యూరో : చంద్రబాబుకి ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు లోక్సభ పరిధి, కొండేపి నియోజకవర్గం టంగుటూరులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగిసి పోతాయని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది.. ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుందన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. పేదల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టో గమనించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాల పేరిట బాబు మోసం చేశారు..
జాబ్ రావాలంటే బాబు రావాలనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని సీఎం జగన్ అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కేవలం 31 వేల ఉద్యోగాలిచ్చాడని, మనం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు అని వివరించారు. వ్యవసాయం, రైతుల విషయంలో రుణమాఫీ అని మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదు.. పెట్టుబడి సాయం ఇచ్చారా?, సబ్సిడీ ఇచ్చిందా అని ప్రశ్నించారు. సున్నా వడ్డీ ఈ పెద్ద మనిషి ఇచ్చాడా?, మీ బిడ్డ జగన్ ఇచ్చాడా? ఆలోచించాలన్నారు. వ్యవసాయం దండగా అని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా అన్నారు. బషీర్ బాగ్ లో రైతులపైకాల్పులు జరిపించింది, ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అంది చంద్రబాబు అన్నారన్నారు. రైతుల్ని నిట్టనిలువుగా ముంచిన చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ కాదా? అని జగన్ ప్రశ్నించారు.
పెన్షన్ల పంపిణీలోనూ కుట్రే
ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపింది ఎవరు?, పేదల సంకెళ్లను తెంచుకునేలా చదువుతో బాగు చేయించింది ఎవరు? అని ప్రశ్నించారు. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు?, మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని జగన్ అన్నారు. పచ్చ కామెర్లు వచ్చాయా?. కళ్లెదుట కనిపిస్తున్న రిపోర్టు కనిపించడం లేదా? అని మండిపడ్డారు. బాబు చేస్తున్న మరో దుర్మార్గం పెన్షన్ల విషయంలో కుట్ర అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి అవ్వాతాతల కష్టాలను ఏనాడైనా పట్టించుకున్నాడా?, పెన్షన్లను ఇంటికే అందిస్తున్న ఘనత మీ బిడ్డది అన్నారు. చంద్రబాబు కుట్రలు చేస్తూనే నెపం మీ బిడ్డ జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. మళ్లీ మానపై ఆరోపణలు చేయడం కంటే దిగజారుడు తనం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోచుకుని పంచుకోవటమే.. పని
చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్రలేదని, ధ్యాస దోచుకోవడం, దోచుకోవడం పంచుకోవడం మీద కాబట్టే అక్కాచెల్లెమ్మలకు న్యాయం జరగలేదని జగన్ అన్నారు. ఎవరి విశ్వసనీయత ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలు.. చేసిన మోసం గుర్తున్నాయా అన్నారు. ఇంటింటికి జాబ్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తా అన్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఇవ్వలేదని దుయ్యబట్టారు. వలంటీర్లు మన ఇంటికి మళ్లీ రావాలి అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలి.. ఎన్నికలుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు. కొండేపిలో మంచి వ్యక్తి మంత్రి ఆదిమూలపు సురేష్ ను గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.