కర్నూలు, ప్రభన్యూస్ బ్యూరో : నైరుతి అవర్తనంతో కర్నూలు జిల్లాతో పాటు పోరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. వీటి మూలంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్ర్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా జూరాల పొంగి ప్రవ హిస్తుండటంతో శ్రీశైలంకు భారీగా వరద ప్రవాహం చేరుకుంటోంది. ఇదే క్రమంలో కర్నూలు జిల్లాలోని తుంగభద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి తుంగభ ద్ర, కృష్ణాలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణానది క్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది.
ఆ నీరు నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుకోవడంతో గంటగంటకు నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారంరాత్రి 7 గంటలకు అందిన సమాచారం మేరకు శ్రీశైల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయానికి 48510 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎగువ నుంచి వచ్చిచేరుతోంది. ఇక ఎగువ నుండి వస్తున్న వరదలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ఉధృత్తి క్రమంగా పెరుగుతోంది. అల్మట్, నారాయణపూర్‌ల నుంచి జురాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో జూరాల స్పిల్‌వే నుంచి 12232 క్యూసెక్కులు విడుదలవుతుండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 36187 క్యూసెక్కులు కలిపి మొత్తం 48510 వేల క్యూసెక్కుల నీరు శ్రీ శైలానికి చేరుకుంటుంది. దీంతో జలాశయం పరిధిలోని ఎడమ కేంద్రంలో ఉదయం విద్యుత్ ఉత్పత్తి కొనసాగించారు. ఉదయం జలాశయంకు 55706 క్యూసెక్కుల ప్రవాహాం ఉండగా, వీటిలో 25425 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వార దిగువ సాగర్‌కు విడుదల చేశారు. ఈ నీటి వినియోగం ద్వార 4.265 మెగా యూనిట్లను ఉత్పత్తి చేస్తూ వచ్చారు.
మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం తెలంగాణ సుమారు 80,098 క్యూసెక్కుల నీటిని వినియోగ అనంతరం నీటి వినియోగంపై ఏపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో నిలిపివేశారు. వాస్తవంగా శ్రీశైల జలాశయం 855 అడుగులకు చేరగానే ఏపి పరిదిలోని కాలువలకు, కెనాల్స్‌కు నీటిని విడుదల చేయాలి. అయితే ప్రస్తుతం 859 అడుగులకు చేరిన నీటిని విడుదల చేయకపోవడంపై రైతు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది.
అసలే ఈ ఏడాది శ్రీశైల జలాశయంకు నీటి వ్రవాహం ఆలస్యంగా చేరడం కూడ ఇందుకు మరో కారణం. కాగా తెలంగాన పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి నీటిని వినియోగించడం గమనార్హం. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో విద్యుత్ ఉత్పాధన చేపట్టడం ఇదే తొలి కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 859 అడుగులుగా ఉంది.
ఇక నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 102.8910 టిఎంసిలుగా నీటి నిల్వలు ఉన్నాయి. మరోవైపు తుంగభద్ర జలాశయంకు వరద పోటెత్తుతోంది. దీంతో తుంగభద్ర జలాశయం 1633 అడుగులకు గాను, 1627 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 105 టిఎంసిల నీటి నిల్వలకు గాను 84.515 టిఎంసిల నీటి నిల్వలున్నాయి. ఇక డ్యాంకు 16129 క్యూసెక్కుల నీటి ప్రవహాం వస్తుండగా, 6043 క్యూసెక్కులు హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, ఎల్ఎల్సి టిబిపికి విడుదలవుతుంది.