విజయనగరం, (ప్రభ న్యూస్) : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఒక ప్రకటన ద్వారా కోరారు. ఇళ్లు లేదా స్థలంపై శాశ్వత హక్కును కల్పించే ఈ పథకం లబ్ధిదారులకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. 1983 నుంచి 2011 వరకూ వివిధ గృహ నిర్మాణ పథకాల ద్వారా రుణాలు తీసుకొని, ఇళ్లు నిర్మించుకున్నవారికి, ఒన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఆయా ఇళ్లు, స్థలాలను తమ పేరుమీద రిజిష్టర్ చేసుకొనే గొప్ప అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని, తద్వారా దానిపై సంపూర్ణ హక్కులు కలుగుతాయని తెలిపారు.
ఈ ఒన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద, ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి జిల్లాలో ఇప్పటికే సర్వే పూర్తి చేసినట్లు తెలిపారుజ. జిల్లాలో సుమారుగా 3,44,278 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి, కొలతలు తీసి, సోషల్ ఆడిట్ తరువాత వారికి సంపూర్ణ హక్కు పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని వల్ల లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు వస్తాయని, 22 ఏ నిబంధన కింద సమస్యలు కూడా ఉత్పన్నం కావని స్పష్టం చేసారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి రుణవసూళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి రిజిస్టర్ డాక్యుమెంట్లను ఆందజేయడం జరుగుతుందని, ముందుగా డబ్బు చెల్లించినవారికి ముందుగానే అందజేస్తామని తెలిపారు. ఒకే విడతలో తమ రుణాన్ని, వడ్డీని పూర్తిగా మాఫీ చేసుకొని, ఇంటిపై సంపూర్ణ హక్కులను కలిగించే ఈ గొప్ప అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily