Friday, September 20, 2024

AP: విరిగిపడిన కొండచరియలు.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విజయవాడ నడిఒడ్డున ఉన్న కొండ ప్రాంతాలు నగరవాసులను భయపెడుతున్నాయి. తరచూ కురుస్తున్న వర్షాలు భారీ వరదలకు కొండ ప్రాంతాలు నాని ఉండి, కొండచరియలు ఎప్పటికప్పుడు విరిగిపడుతుండడం కొండ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాణాల మీదకు తీసుకువస్తుంది.

పది రోజుల క్రితం నగరంలోని సున్నబంటీ సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతిచెందగా, మరికొందరు గాయాలపాలయ్యారు. తాజాగా మంగళవారం నగరంలోని మాచవరం ప్రాంత పరిధిలో కొండ చ‌రియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

గడిచిన వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతమంతా పూర్తిగా నాని ఉండడంతో కొండపై ప్రాంతం నుండి చరియలు విరిగి పడుతున్నాయి. నగరంలోని మాచవరం ప్రాంత పరిధిలో మోడరన్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న గూడ వెంకటస్వామి వీధిలో మంగళవారం ఉదయం కొండ చరియలు పడిన ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. కార్మిక నగర్ కు చెందిన ఇజ్జడ రాము(55) అనే కార్మికుడు మృతిచెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

పెద్ద పెద్ద బండ రాళ్లు ఒక్కసారిగా మీద పడడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బండరాళ్ల కింద మరి కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement