ఏపీ సచివాలయ ఉద్యోగులను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ బారిన ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో సచివాలయ ఉద్యోగి కరోనాతో మృతి చెందాడు. మున్సిపల్ శాఖలో ఏఎస్‌వోగా విధులు నిర్వహిస్తున్న బి.శంకరప్ప కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూశారు.
కాగా, కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇప్పటికే కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు లేఖ రాశారు. 40- 50 శాతం మంది ఉద్యోగులు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోంకు అవకాశమివ్వాలని సీఎస్‌ను కోరుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని.. ఉద్యోగులమంతా భయాందోళనతో ఉన్నామని సచివాలయ సంఘం నేతలు అంటున్నారు.