ఒంగోలు … రెండు సార్లు చంద్రబాబు పాలన, ఒక్క సారి వైఎస్ జగన్ పాలనను చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నాలుగున్నరేళ్ళలో చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి కావాల్సిన అన్నీ ప్రాజెక్టులు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ ఒక్కరూ సాదరంగా షర్మిలను ఆహ్వానించారన్నారు. షర్మిలకు ఆంధ్ర ప్రదేశ్‌లో బాద్యతలు అప్పగిస్తాం.. మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరువచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని మాణిక్కం ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం సాండ్, లాండ్, మైన్, వైన్‌లపై నడుస్తుందని ఆయన విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అవకతవకలపై విచారణకు కోరతామన్నారు.
ఏపీలోని రాజకీయ నేతలు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలను పోల్చిన ఠాకూర్.. బీ ఆంటే బాబు, పీ అంటే పవన్, జే అంటే జగన్.. ఏపీలోని ఈ కొత్త బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ స్థానాలు గెలుస్తాం అనే ధీమా వ్యక్తం చేశారు.