Monday, November 18, 2024

ఓసారి కోర్టు కొట్టేస్తే శాఖాపరమైన చర్యలు చెల్లవు.. ఆ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాల్సిందే

అమరావతి, ఆంధ్రప్రభ : ఓ ఉద్యోగిపై ఆరోపణలతో నమోదైన కేసును కోర్టు కొట్టేసిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యలేవీ చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉద్యోగిని విధుల్లోకి తీసుకుని తీరాల్సిందే అని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో ఆ ఉద్యోగిని తొలగించినప్పటి నుంచి నిర్దోషిగా తేలేంత వరకు అతనికి రావాల్సిన జీతబత్యాలకు అర్హుడుకాదని తేల్చిచెప్పింది. అయితే తరువాత విధుల్లోకి తీసుకున్న నాటి నుంచి అన్నిరకాల ప్రయోజనాలు వర్తింపచేయాలని అధికారులను ఆదేశించింది. రూ.65వేల నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రభుత్వ సర్వీసుల నుండి డిస్మిస్‌ అయిన ఓఉద్యోగి ఉదంతంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకోవటంతో పాటు అన్ని ప్రయోజనాలు వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కీలక తీర్పునిచ్చింది.

దీంతో సదరు ఉద్యోగికి సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం 28 ఏళ్ల తరువాత మళ్లి ఉద్యోగంలో చేరే వీలు కలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో డీ ఖాసిం సాహెబ్‌ అనే వ్యక్తి టైపిస్టుగా పనిచేస్తున్నారు. సహచర ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేయటం ద్వారా రూ. 65వేల 746 మేరకు దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో 1988లో నందికొట్కూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపిన అనంతరం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు తేలటంతో అతన్నిఉద్యోగం నుంచి తొలగిస్తూ 1995లో మార్కెట్‌ కమిటీ పర్సన్‌ ఇన్‌చార్జి ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఖాసిం సాహెబ్‌పై నమోదైన కేసును నందికొట్కూరు జూనియర్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 1997లో విచారణ జరిపి కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టు తీర్పుపై పోలీసులు హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -

విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 1998లో రివిజన్‌ పిటిషన్‌ను త్రోసిపుచ్చింది. దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ పర్సన్‌ ఇన్‌చార్జి జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ ఖాసిం సాహెబ్‌ 2001లో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ట్రిబ్యునల్‌ (ఏపీఏటీ)లో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే పర్సన్‌ ఇన్‌చార్జి ప్రొసీడింగ్స్‌పై రెండున్నరేళ్ల తరువాత పిటిషన్‌ వేశారనే కారణంగా ఏపీఏటీ అతని పిటిషన్‌ను కొట్టేస్తూ 2003లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ వెణుతురుమిల్లి గోపాలకృష్ణారావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తాజాగా తీర్పును వెలువరించింది. కింది కోర్టు నిర్దోషిగా తేల్చినప్పుడు అవే అభియోగాలతో శాఖాపరమైన విచారణలో తప్పుపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం చెల్లుబాటుకాదని తేల్చిచెప్పింది.

సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని వివరించిందని గుర్తుచేసింది. ఖాసిం సాహెబ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ట్రిబ్యునల్‌ తీర్పును కూడా ఈ సందర్భంగా ధర్మాసనం తప్పుపట్టింది. ఖాసిం సాహెబ్‌పై వచ్చిన అభియోగాల మేరకు శాఖాపరమైన విచారణ జరిపారు.. కేసు కూడా నమోదయింది.. ఇందులో లభ్యమైన ఆధారాల మేరకు కింది కోర్టు కూడా విచారణ జరిపింది. అతను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అంతేకాదు పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. ఇక ఇందులో విచారించి చర్యలు తీసుకోవటానికి ఏముందని ప్రశ్నించింది. అతను నిర్దోషిగా పరిగణించినప్పుుడు న్యాయస్థానం ఆదేశాలను పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఉద్యోగిపై ఆరోపణలతో నమోదైన కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ఆ కేసును కొట్టేయటంతో పాటు ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అతన్ని విధుల్లోంచి తొలగించిన నాటి నుంచి ని ర్దోషిగా తేలే వరకు జీతబత్యాల కు అనర్హుడని తిరిగి ఉద్యోగంలో తీసుకున్నాక అన్ని ప్రయోజనాలు వర్తింపచేయాలని తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement