నెల్లూరు కల్చరల్, (ప్రభ న్యూస్): నగరంలో మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఆకాశ దీపాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకుని శ్రీవారి కైంకర్యంలో పాలుపంచుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి విశేష పూలఅంకరణ చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా నూనె మల్లికార్జున, కామాక్షి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, దేవస్థాన ఛైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఉస్మాన్సాహెబ్పేట శివాలయంలో..
నగరంలోని ఉస్మాన్సాహెబ్పేట శివాలయంలొ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఛైర్మన్ మేడా కామేశ్వరరావు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, దీపాలంకరణతో పాటు 700 మందికి అన్నదానం చేయడం జరిగింది. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో దేవస్థాన కమిటీ ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంకాలం భారీ ఎత్తున భక్తులు వచ్చి కార్తీకదీపం వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి యామిని ప్రత్యూష, నాగరాజు, సతీష్, సురేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో..
నగరంలోని రంగనాయకులపేట శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కృత్తికా దినోత్సవం, లంకాదహనం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాధస్వామి వారికి పేట ఉత్సవం జరుగుతుందని కార్యనిర్వహణాధికారి డి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..