ఒంగోలు, ప్రభన్యూస్ : జిల్లాల పునర్విభజనకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ప్రకాశం జిల్లా మూడు ముక్కలు కానుంది. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కవడంతో కందుకూరు రెవెన్యూ డివిజన్ కనుమరుగు కానుంది. తెరమీదకు కనిగిరి కొత్త రెవెన్యూ డివిజన్ తెరమీదకు వచ్చింది. అంతే కాదు అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కలవనున్నాయి. అలాగే పోలీసు స్టేషన్ల స్వరూపం కూడా మారనుంది. జిల్లాల విభజన పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతూ…నిరహార దీక్షలు..ఆందోళనలు చేపట్టినా.. ప్రభుత్వం ఆవేమీ పట్టించుకోవడం లేదు. అంతే కాదు ఉగాది నుంచి కొత్త జిల్లాలో పాలన సాధ్యపడుతుందా..? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మార్కాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున ఆం దోళనలు, నిరహార దీక్షలు జరుగుతున్నాయి. అలాగే కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలంటూ పట్టుబడుతున్నారు. ఇలా.. అన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి కొత్త పాలనను తీసుకురావాలని యోచిస్తోంది. ఏప్రిల్ 2వ తేదిన ఉగాది పండుగ. పండుగకు కేవలం 45 రోజులు మాత్రమే గ డువు ఉంది. ఈ లోపు కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యమైనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అద్దంకి, పర్చూరు, చీరా ల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కలవనున్నాయి. బాపట్ల కలెక్టరేట్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాపట్ల కలెక్టరేట్‌ను ఏపీ మానవ వనరుల అభి వృద్ధి సంస్థలోని హెచ్‌ఆర్‌డీఐ, పీఆర్ అండ్ ఆర్‌డీలలో ఏర్పాటు చేయాలని భావిస్తు న్నారు. హెచ్‌ఆర్‌డీఐలోని 44 గదుల హాస్టల్‌తో పాటు, 39,336 చదరపు అడుగులు, పీఆర్ అండ్ ఆర్‌డీ సెమినార్ హాల్-1,2లలో వినియోగిస్తారు. ప్రభుత్వ శాఖల న్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కార్యాలయాలు, అధికార నివాసాల కోసం అన్వేషిస్తున్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటుకు ముసాయిదా నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఏర్పాట్ల విషయంలో ఒక అడుగు ముందుకు..అయిదడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాల యాల ఎంపిక జరుగుతున్నా..జిల్లా సరిహద్దులు, సాంకేతిక పరిజ్ఞానం..వంటి కీలక అంశాల పై సమీక్షలు జరిగిన దాఖలాలు లేవు.
ఆగని ఆందోళనలు..
బాపట్ల కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటన వెలువడిన నాటి నుంచే ఒంగోలు పార్లమెంటు పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం , కందుకూరు, తదితర చోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికీ వివిధ పద్ధతుల్లో కొనసాగిస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిరహారదీక్షలు సైతం చేపట్టారు. అలాగే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలంటూ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నారు. ఆ ప్రాంతంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీలు సైతం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అంతే కాదు అద్దంకిని ప్రకాశంలోనే ఉంచాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో సైతం భారీ ర్యాలీ చేపట్టారు. ఇదిలా ఉండగా మరో వైపు పొదిలిని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో పొదిలిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో పొదిలి కాకుండా కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు, నేతలు విభజన తీరు పై మండిపడుతున్నారు.
అభ్యంతరాల పరిష్కారానికి కమిటీ..
కొత్త జిల్లాల ఏర్పాటు పై వచ్చే అభ్యంతరాలు, సూచనల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ నియమించింది. ఈ కమిటీలో కలెక్టర్ , సీసీఎల్‌ఏ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వచ్చే సూచనలు, అభ్యంతరాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాటి పై తుది నిర్ణయం సీఎస్ కమిటీ తీసుకుంటుంది. ప్ర జల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఏ రోజుకా రోజు కలెక్టర్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూడీఆర్‌పీ.ఏపీ. జీవోవీ. ఇన్ వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆప్‌లోడ్ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దాని పై రిమార్కు రాయాల్సి ఉంటుంది. ఆ తరువాత వాటిని రాష్ట్ర స్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. అభ్యంతరాలను మార్చి 3వ తేది వరకు ఇవ్వవచ్చు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అభ్యంతరాలను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్‌కు 24 ఫిర్యాదులు అందినట్లు సమాచారం. మార్కాపురం, కందుకూరు, అద్దంకి ప్రాంతాల నుంచి ఈ ఫిర్యాదుల అందినట్లు సమాచారం.
నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు
పశ్చిమ ప్రాంత వాసుల ఆకాంక్ష.. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసుకునేందుకు మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం నుంచి రిలే నిరహారదీక్షలు చేపట్టనున్నారు. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా..విద్య,ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా..ఆర్థిక వనరులు సమకూరాలన్నా వెనుకబడిన ప్రాంతాలైన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల అభివృద్ధి చెందాలంటే మార్కాపురం జిల్లా కేంద్రంతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..