సమాధానం చెప్పలేకపోయిన అధికారులు
ముత్తుకూరు, జనవరి 7 (ఆంధ్రప్రభ) : సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ముత్తుకూరు, పంటపాలెం గ్రామపంచాయతీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాల్టా చట్టాన్ని అతిక్రమించి అనధికారకంగా బోర్లు వేసుకుని భూగర్భ జలాలు తోడేస్తున్న వైనంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం మంగళవారం పర్యటించింది. ఢిల్లీకి చెందిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ తరపున విశాఖపట్నం నుంచి భూగర్భ జలాల డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ లక్ష్మీనారాయణ, ఉన్నతాధికారులు చంద్ర లీల, ఓబులేసు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వచ్చారు.
మొదట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విచారణకు వచ్చిన అధికారుల ఎదుట పిటిషన్ దారులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు – ముత్తుకూరు ప్రధాని రోడ్డు మార్గంలో అక్రమంగా ఏర్పాటైన నీటి వినియోగం బోర్లు, అదేవిధంగా పంటపాలెంలో కూడా అక్రమ బోర్లు పరిశీలించారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ శాఖ అధికారులు కొంతమంది సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. అక్రమ బోర్లు ఏర్పాటు చేసుకున్న భూములు సర్వే నెంబర్లు, భూగర్భ జలాలు తోడివేస్తున్న వారు ఎవరనే విషయాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.