Saturday, November 23, 2024

న్యాయం కోసం ఎడ్లబండిపై.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి సుప్రీంకోర్టుకు

బోనకల్‌, ప్రభన్యూస్‌: తన సోదరిని వివాహమాడి అకారణంగా వదిలివేసిన భర్త, అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితురాలి సోదరుడు నేలవెల్లి నాగ దుర్గారావు, తల్లి జ్యోతి ఆంధ్రప్రదేశ్‌ నుండి ఈ నెల 23న ఎడ్లబండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ మండలం ముప్పాల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగ దుర్గారావు సోదరి నేలవెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌ కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. కట్నంగా 23 లక్షల రూపాయల నగదు, 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చినట్లు నవ్యత సోదరుడు దుర్గారావు పాత్రికేయులకు తెలిపారు. వివాహం జరిగిన నాటి నుండి తన భర్త కొంగర నరేంద్రనాథ్‌ తనతో సరిగా ఉండటం లేదంటూ నవ్యత తన ఆడబిడ్డ కంటమనేని మధుర స్రవంతికి చెప్పింది. ఈ విషయంపై స్పందించిన మధుర స్రవంతి ఇట్టి విషయాన్ని బయటకు చెప్పవద్దని, తమ కుటుంబ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయమని, మా అన్నకు వైద్యం చేపిస్తానని మాట ఇచ్చింది. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా తన దారి తాను చూసుకుని జర్మనీ వెళ్లిపోయిందని నవ్యత సోదరుడు తెలిపారు.

అంతేకాకుండా కొంగర నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఆమె చేత బ్లాంక్‌ పేపర్‌లపై సంతకాలు చేయించుకున్నారని నవ్యత సోదరుడు నేలవెల్లి దుర్గారావు పేర్కొన్నాడు. జరిగిన ఉదంతంపై చందర్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపాడు. కొంగర నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులు తమ ఆర్థిక, అంగబలాన్ని ఉపయోగించి కేసులో పురోగమనం లేకుండా చేస్తున్నారని వాపోయారు. ఈ సంఘటనపై సంపూర్ణ న్యాయం జరగాలని దీక్ష భూని న్యాయం కోసం ఢిల్లీ వెళుతున్న క్రమంలో న్యాయం కావాలని కోరుతూ కొంగర నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యుల ఫోటోలతో కూడిన ప్లెక్సీని ఎడ్ల బండికి ఏర్పాటు చేయగా, ఈ విషయంపై నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులు తమపై 50 లక్షలు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తగు న్యాయం కోసం ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకొని సుప్రీంకోర్టు న్యాయస్థానానికి వెళుతున్నానని, అవసరమైతే హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తామని తెలియజేశారు. తమ ప్రయాణంలో భాగంగా రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నామని, రెండు నెలల్లో ఢిల్లీ చేరి న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement