Wednesday, September 18, 2024

AP: ఎన్యుమరేషన్ లో ఆఫీసర్లు బిజీబిజీ..

పేర్లు లేకపోతే సచివాలయంలో నమోదు
అప్పటికప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు సెటిల్
మరమ్మత్తులకు 200మంది టెక్నిషియన్లు రెడీ
ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు ఫ్రీ
స్పేర్ పార్టులకు 50శాతం రాయితీ


(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విజయవాడలో బుడమేరు వరద బాధితుల ఎన్యుమరేషన్ లో ఎన్టీఆర్ జిల్లా అధికారులు బిజీబిజీ అయ్యారు. ఆదివారం సాయంత్రం లోపు నష్టాల నివేదికను ప్రభుత్వానికి అందించే పనిలో నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు రీవెరిఫికేష‌న్ (క్రాస్ చెక్‌) జరుపుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్డీఆర్ జిల్లా క‌లెక్టర్ డాక్టర్. జి.సృజ‌న శ‌నివారం న‌గ‌రంలోని సింగ్‌న‌గ‌ర్, వాంబే కాల‌నీల్లో ప‌ర్యటించి నష్టం వివ‌రాల డేటా రీవెరిఫికేష‌న్ ప్రక్రియ‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా వరద బాధితులతో క‌లెక్టర్ సృజ‌న మాట్లాడుతూ… జిల్లాలో వ‌ర‌ద ముంపు న‌ష్టాల న‌మోదు ప్రక్రియను దాదాపు పూర్తిచేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఏ కార‌ణం చేత‌నైనా పేర్లు న‌మోదు కాని బాధితులకు స‌చివాల‌యాల్లో మ‌రో అవ‌కాశం క‌ల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమ‌రేష‌న్ వివ‌రాల‌ను యాప్‌లో న‌మోదు చేస్తామన్నారు.

- Advertisement -

న‌ష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామన్నారు. ముంపునీటిలో న‌ష్టపోయిన గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులు, మొద‌టి అంతస్తులో ఎలాంటి న‌ష్టం జ‌రిగినా, ఆ వివ‌రాల‌ను కూడా సేక‌రించి, నివేదిక‌లో పొందుప‌ర‌చాల‌ని ఎన్యూమ‌రేష‌న్ బృందాల‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దెబ్బతిన్న వాహ‌నాల‌కు, ఇత‌ర ఆస్తుల‌కు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల‌ను సెటిల్ చేసుకోవాల‌న్నారు. దాదాపు 20ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు తమ ప‌రిధిలో అప్పటిక‌ప్పుడే క్లెయిమ్‌ల‌ను సెటిల్ చేసి బాధితుల‌కు స‌హ‌క‌రిస్తున్నట్టు తెలిపారు. సింగ్ న‌గ‌ర్‌, వాంబే కాల‌నీ, భ‌వానీపురం, పాయ‌కాపురం, కండ్రిక‌, వైఎస్ఆర్ కాల‌నీ, రాజ‌రాజేశ్వరిపేట ప్రాంతాల్లో మెప్మా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ అనుసంధానంతో అర్బన్ కంపెనీ యాప్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచారు.

మెప్మా ఆర్‌పీలు, సిబ్బంది తమ ప‌రిధిలోని స్వయం స‌హాయ‌క సంఘాల స‌భ్యుల ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి అవ‌స‌ర‌మైన సేవ‌లు పొందేందుకు రిజిస్ట్రేష‌న్ చేయించాలని కలెక్టర్ సూచించారు. ఈ రిక్వెస్ట్‌ల ఆధారంగా టెక్నీషియ‌న్లు స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి సేవ‌లందిస్తున్నట్లు వివ‌రించారు. ఎల‌క్ట్రీషియ‌న్‌, ప్లంబ‌ర్‌, పెయింట‌ర్‌, కార్పెంట‌ర్‌, ఏసీ మెకానిక్, టీవీ టెక్నీషియ‌న్ ఇలా వివిధ సేవ‌లు అందిస్తున్నటు తెలిపారు.

దాదాపు 200మంది టెక్నీషియ‌న్లు ఈ ప‌నుల్లో నిమ‌గ్నమ‌య్యారన్నారు. అవ‌స‌రం మేర‌కు బ‌య‌ట ప్రాంతాల నుంచి కూడా టెక్నీషియ‌న్లను ర‌ప్పించి సేవ‌లందించేలా చ‌ర్యలు తీసుకున్నామ‌న్నారు. పాడైన ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల రిపేర్ల విష‌యంలో ఆయా కంపెనీలు లేబ‌ర్ ఛార్జీల్లో పూర్తిగా, స్పేర్ పార్ట్స్‌లో 50శాతం మేర రాయితీ క‌ల్పిస్తూ సేవ‌లందించేలా చేస్తున్నామ‌ని క‌లెక్టర్ సృజ‌న వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement