Thursday, November 21, 2024

AP | అదిరే ఆఫర్లు, వినూత్న స్కీములు.. ప్రయాణికులకు చేరువవుతున్న ఆర్టీసీ

అమరావతి, ఆంధ్రప్రభ:అదిరిపోయే ఆఫర్లు.. వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికులకు చేరువవుతున్న ఆర్టీసీ.. వయో వృద్ధులకు మరో కొత్త వెసులుబాటు కలిపించింది. సీనియర్‌ సిటిజన్ల రాయితీ కోసం డిజిటల్‌ గుర్తింపు కార్డులకు అనుమతిచ్చింది. ఇదే సమయంలో ఆధార్‌ సహా ఇతర గుర్తింపు కార్డులను అనుమతించనున్నట్లు పేర్కొంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ఎండీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు స్కీములు ప్రవేశ పెట్టారు. వివిధ వర్గాల ప్రయాణికులకు రాయితీలు ఇస్తూ ఆర్టీసీని అందరి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పండుగ ఆఫర్లు, ముందస్తు రిజర్వేషన్‌ ఆఫర్లు, సీనియర్‌ సిటిజన్లు.. ఇలా పలు రాయితీలు చేపట్టి అమలు చేస్తున్నారు.

డిమాండ్‌ పెంచిన పండుగ ఆఫర్లు..

- Advertisement -

పండుగ ఆఫర్లతో ఆర్టీసీకి పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరిగింది. గతంలో పండుగలు, పర్వదినాల్లో నిర్వహించే ప్రత్యేక సర్వీసులకు అదనపు రుసుములు ఉండేవి. ఒక వైపు మాత్రమే ప్రయాణికుల రద్దీ ఉంటుందని చెపుతూ టిక్కెట్టుపై 50శాతం అదనపు రుసుము వసూలు చేసే వారు. అదనపు రుసుముతో ప్రయాణికులపై పెద్ద మొత్తం భారం పడేది.

ఆర్టీసీ అదనపు బాదుడుతో ప్రయాణికులు ప్రత్యమ్నాయ ప్రయాణ మార్గాలను ఎంచుకునే వారు. వీటిపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అధ్యయనం చేయించారు. అదనపు ఛార్జీల భారంతో ప్రత్యేక పర్వదినాలు, పండుగ రోజుల్లో ఆశించిన మేర ఓఆర్‌(ఆక్యుపెన్షీ రేషియో) రావడం లేదని గుర్తించారు.

ఎప్పుడైతే ఓఆర్‌పై దృష్టిసారించారో.. ఆ క్రమంలో భాగంగానే అదనపు ఛార్జీలను రద్దు చేశారు. గత రెండేళ్లుగా ఆర్టీసీ అదనపు ఛార్జీలు లేకుండానే దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఓఆర్‌ శాతం కూడా పెరిగింది.

ఆధ్యాత్మిక కేంద్రాలకు..

పండుగ రోజుల్లో అదనపు ఛార్జీల రద్దుతో ఆర్టీసీకి పెరిగిన ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. తొలుత తమిళనాడులోని అరుణాచలం క్షేత్రానికి కొద్ది సర్వీసులు నడిపారు. ప్రతి నెలా పౌర్ణమికి ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని విజయవాడ వంటి కీలక పట్టణాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపారు. వీటికి పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో ఇప్పుడు ఏపీలోని అన్ని డిపోల నుంచి పౌర్ణమికి అరుణాచలం స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు.

ఇదే తరహాలో కార్తీక మాసం వంటి ప్రత్యేక పర్వదినాల్లో పంచారామాల దర్శనం, మహా శివరాత్రికి కోటప్పకొండ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు, దసరా రోజుల్లో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు ఏ విధమైన అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల్లోని పుణ్యక్షేత్రాలకు ఆయా జిల్లాల ప్రధాన కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు నడిపే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉన్నారు.

అదనపు రాయితీలు..

ఆర్టీసీ ప్రయాణికులకు పలు అదనపు రాయితీ సౌకర్యాలు కలిపిస్తున్నారు. ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకుంటే దూర ప్రాంత సర్వీసులకు 10శాతం వరకు రాయితీలు వర్తింప చేస్తున్నారు. కుటుంబ సభ్యులు రానుపోను ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న పక్షంలో అదనపు రాయితీలు ఇస్తున్నారు.

ఇవి కాక సీనియర్‌ సిటిజన్లకు 25శాతం రిజర్వేషన్‌, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారుల రోజు వారీ ప్రయాణాలకు పలు రాయితీలు ఇస్తూ ఆర్టీసిని ప్రయాణికులకు చేరువ చేసేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. గతంలో డిజిటల్‌ పేమెంట్లకు అవకాశం ఉండేది కాదు. డిజిటల్‌ పేమెంట్లకు పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చారు.

వృద్ధులకు వెసులుబాటు..

ఆధార్‌ నిర్బంధం కావడంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు మాన్యువల్‌ రూపంలోని ఆధార్‌ కార్డులు ఉంటేనే 25శాతం రాయితీ ఇస్తున్నారు. అందుబాటులో ఆధార్‌ లేకపోవడం, మరిచిపోవడం వంటి కారణాలతో 25శాతం రాయితీని వృద్ధులు వినియోగించుకోలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ కాకపోడం కూడా ఇబ్బందిగా మారింది.

ఇకపై ఆధార్‌ లేకున్నా సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డు, పాన్‌ కార్డు, వోటర్‌ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుందని అధికారులు చెపుతున్నారు. గతంలో కార్డులు చూపించి టిక్కెట్టు పొందాల్సి వచ్చేది. ఇకపై డిజిటల్‌ గుర్తింపు కార్డులను కూడా అనుమతించాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వృద్ధులు కార్డులు వెంట తీసుకెళ్లే పరిస్థితికి స్వస్తి చెప్పే వీలు కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement