Monday, November 18, 2024

ఆంధ్రా లీడర్ల కదలికలపై ఒడిశా నిఘా.. కొఠియా గ్రామాల్లో పోలింగ్​ శాతం పెంచే యత్నాలు..

సాలూరు రూరల్‌, (ప్రభ న్యూస్‌) : ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు, అధికారులు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లాకి చెందిన అధికారులు, సాలూరు ప్రజాప్రతినిధులు కదలికలపై నిఘా వేసినట్లు సమాచారం. త్వరలో ఒడిశాలో జరగనున్న ఎన్నికల సందర్భంగా వారిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నాయకులు ఏమైనా ప్రయాత్నాలు చేస్తున్నారా అన్న విషయమై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు వారికి అనుకూలంగా ఉన్న గిరిజన నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రాకి అనుకూలంగా గిరిజన నాయకులతో పాటు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలుపొందినసర్పంచ్‌లు, ఎంపీటీసీల కదలికలను గమనిస్తున్నారు. దీంతో వారిలో ఎన్నికల సందర్భంగా అభద్రతా భావం ఏర్పడినట్లు సాలూరుకు చెందిన నాయకులు భావిస్తున్నారు.

ఒడిశా రాష్ట్రంలో ఈనెల 16 నుండి 24 వరకు ఐదు విడతలుగా పంచాయతీ రాజ్‌ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా పొట్టంగి బ్లాక్‌ అరిధిలో ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. పొట్టంగి జిల్లా పరిషత్‌ బ్లాక్‌లో రెండు జడ్పీ స్థానాలుండగా అందులో కొఠియా గ్రూప్‌ గ్రామాలు జోన్‌వన్‌ జెడ్పీ స్థానం పరిధిలో ఉన్నాయి. ఈ స్థానం నుండి ఇరువురు అభ్యర్ధులు పోటి పడుతున్నారు. ఒకరు అఖిల పక్షం అభ్యర్ధి కాగా వేరొకరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్ధి. దీంతో అఖిల పక్షం అభ్యర్ధిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అంతా కలసికట్టుగా వ్యూహాలను రూపొందిస్తున్నారు

బెడిసికొట్టిన అఖిల పక్షం వ్యూహం..

ఇదిలావుండగా కొఠియా గ్రూప్‌ గ్రామాలకు సంబంధించి అన్నిన్‌ రాజకీయ పార్టీలు కలిసి సంయుక్తంగా ఒకే అభ్యర్ధిని జెడ్పీ జోన్‌ వన్‌ స్థానానికి బరిలో నిలిపి ఏకగ్రీవం చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కొరాపుట్‌ జిల్లా కేంద్రంలో గత జనవరి 21న అధికార బీజెడీ, ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమావేశమై అంతా కలిసి ఒకే అభ్యర్ధిని రంగంలో దింపేదుకు నిర్ణయించి, ఏ పార్టీకి సంబంధంలేని మమతా జానీతో నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయించారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిపాయి పుట్టి గ్రామానికి చెందిన గమ్మెల తికాయి నామినేషన్‌ దాఖలు చేయ్యగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నచ్చచెప్పినా ఆమె వినిపించుకోలేదు. చివరకు పార్టీ బిఫార ం ఇవ్వకపోవడ ంతో ఇరువురు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో నిలిచినట్లయింది. దీంతో అఖిల పక్షం అభ్యర్ధిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అంతా కృషి చేస్తుండగా కొఠియా గ్రూప్‌ గ్రామాల నుండి అధిక శాతం ఓట్లను సాధించేందుకు పావులు కదుపుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 13, ఏప్రిల్‌ 8న తేదీల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా కొఠియా, దిగువకొఠియా, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయిభద్ర, ఎగువ శంబి ఓటర్లు అధికంగా పాల్గొనే అవకాశం ఉంది.

సుప్రీం కోర్టు కోసమే ప్రయాస..

- Advertisement -

ఇదిలావుండగా ఒడిశా స్థానిక ఎన్నికల సందర్భంగా కొఠియా గ్రామాల్లో నమోదైన ఓటింగ్‌ శాతాన్ని సుప్రీం కోర్టులో సమర్పించే ఉద్దేశంతో ఒడిశా నేతలు, అధికారులు ఉన్నట్లు ఓటేసేెందుకు పోలింగ్‌ కేంద్రానికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలుచేపట్టారు. మైదాన ప్రాంతంలో ఉన్న నేరెళ్లవలసలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా ఎస్పీతోపాటు ఇరువురు డీఎస్పీలు, సీఐలు, పోలీసులు అధికసంఖ్యలో విచ్చేసి ఓటింగ్‌ జరిగేలా చూసారు. అయినప్పటికీ ఒడిసా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఆంధ్రా అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరకు ఎన్నిక జరిగినప్పటికీ నేరెళ్లవలస బూత్‌లో ఓటింగ్‌ అతి తక్కువగా నమోదయ్యింది. ఈ పరిస్థితి తమకు రాకూడదని బావిస్తూనే ఆంధ్రా అధికారులు, నాయకుల కదలికలపై నిఘా వేసారు. తమ రాష్ట్రం నిర్వహించే స్థానిక ఎన్నికల్లో కొఠియా గ్రూపు గ్రామాల ప్రజలు అధికంగా ఓటింగ్‌లో పాల్గొంటే, వాటి గణాంకాలను కోర్టులో చూపించి అధిక శాతం కొఠియా ప్రజలు తమకు (ఒడిసా) అనుకూలంగా ఉన్నారని చెప్పేందుకు చూస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రా అధికారులు, ప్రజాప్రతినిధులు కదలికలపై దృష్టిసారించారనిసమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement