సార్వత్రిక ఎన్నికల వేళ.. అంతా కౌంటింగ్ ఎలా ఉండబోతోంది. ఎవరు గెలుస్తారు.. ఎవరి తలరాత ఎలా ఉండబోతోందనే సీరియస్ థింకింగ్‌లో ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సరికొత్త ట్రెంట్ సెట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాము పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా.. అంటూ నెంబర్ ప్లేట్స్ తయారు చేసి హల్ చల్ చేస్తున్నారు. పిఠాపురంలో మొదలైన ఈ ట్రెండ్ కాస్త ఏపీ మొత్తం పాకిపోయింది. ఇందులో బాబాయిని లేపేసినోడి తాలూకా అనే నెంబర్ ప్లేట్స్ అయితే.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పవన్ గెలుపు ఖాయం అంటున్న సర్వేలు..
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చాటుతున్న నేపథ్యంలో జనసైనికులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ బోర్డులు తయారు చేయిస్తున్నారు. వాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఈ నేమ్ బోర్డులను తగిలిస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ తప్పకుండా గెలుస్తారనే విశ్వాసంతో పోస్టులు పెడుతున్నారు. పవన్‌ను ముందుగానే ఎమ్మెల్యే చేసేసిన జనసైనికులు పనిలో పనిగా వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్‌కు తమదైన శైలిలో పంచ్‌లు ఇస్తున్నారు.
అభిమానుల క్రేజ్ మామూలుగా లేదు..
సినిమా హిట్టా? ఫట్టా! అనే విషయం పవన్ కల్యాణ్ క్రేజ్‌ని ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లోనూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ క్రేజ్ అలాగే కొనసాగుతోంది. తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయనేది స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఫొటోలు, జనసేన జెండాలు, గాజు గ్లాస్ స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించిన అభిమానులు.. పోలింగ్ తర్వాత ట్రెండ్ మార్చారు. బైక్‌ల వెనక నెంబర్ ప్లేట్ల్ స్థానంలో ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’, ‘పిఠాపురం ఎమ్మెల్యే తమ్ముడు’ అనే స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేమ్ బోర్డుల ప్రచారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఫలితాలు వచ్చే నాటికి ఇంకెన్ని మలుపులు వస్తాయో మరి.
కొత్త బోర్డులతో ఎదురుదాడి..
రాజోలులో ఓ జనసైనికుడు నంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బోర్డు పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఆ వెంటనే మిగతా జనసైనికులు దీన్నో ప్రచారంగా మార్చివేశారు. నేం బోర్డులు తయారు చేయించుకుని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీనికి పిఠాపురం వైసీపీ కార్యకర్తలు కౌంటగ్గా వంగా గీత, డిప్యూటి సీఎం, ఏపీ సీం గారి తమ్ముడు అంటూ బోర్డులను వదిలారు. చిర్రెత్తిన జనసైనికులు బాబాయిని లేపినోడి తాలూకా అంటూ కొత్త బోర్డులతో ఎదురుదాడికి దిగారు.
పట్టించుకోని ఆర్టీఏ అధికారులు..
ఈ వార్ ఇలా కొనసాగుతుండగా పసుపు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతల పేర్లతో బోర్డులు రూపొందించారు. గుంటూరు ఎంపీ గారి తాలూకా, తాడికొండ ఎమ్మెల్యే తాలూకా, ఎమ్మెల్యే యరపతినేని తాలూకా, పొన్నూరు ఎమ్మెల్యే తమ్ముడు అంటూ ఎవరికివారు నేమ్ బోర్డులు తయారు చేయించారు. వాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో వచ్చిన మార్పులను ఆర్టీఏ అధికారులు గమనిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూసుకుందాంలే అన్నట్టు ఉంది వారి పరిస్థితి. అందుకే ఇప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.