విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న 32 శాతం మహిళా విద్యార్థుల సంఖ్యను రాబోయే కాలంలో 50 శాతానికి పెంచేందుకు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం తప్పనిసరిగా చొరవ తీసుకోవాలని దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. అమరావతి విఐటీ – ఏపీ విశ్వవిద్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దగ్గుబాటి పురందేశ్వరి (కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి) గౌరవ అతిధిగా వర్ష విశ్వనాధ్ కస్తూరి (విఐటి పూర్వ విద్యార్థిని, డైరెక్టర్ శ్రీవర్ష గ్రూప్) హాజరయ్యారు. ఈ సందర్బంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవుళ్లు సంచరిస్తారనే సామెతను గుర్తుచేశారు. అంతే కాకుండా వేల సంవత్సరాల క్రితం వేదకాలంలోనే మహిళలు సమానత్వాన్ని, స్వేచ్ఛను అనుభవించారన్నారు. స్త్రీ తన ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చన్నారు. తన జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చన్నారు. కానీ కొంతమంది విదేశీ ఆక్రమణదారుల కారణంగా వారి స్వేచ్ఛ అణచివేయబడిందన్నారు.
స్త్రీ సమానత్వం, జీవన స్వేచ్ఛ ప్రాముఖ్యతను గ్రహించిన డా.బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు, వారి హక్కులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గర్భంలో ఉన్న ఆడపిల్లలను ముందుగా గుర్తించే పరీక్షల విషయంలో కఠిన చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆమె అభ్యర్థించారు. గౌరవ అతిధి వర్షా విశ్వనాథ్ కస్తూరి (విఐటి బి.టెక్ మెకానికల్ బ్యాచ్ 2010-14 పూర్వ విద్యార్థిని, డైరెక్టర్ శ్రీవర్ష గ్రూప్) మాట్లాడుతూ… తాను విఐటి చదువుకొన్న రోజులను గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా విఐటి తమ విద్యార్థినులకు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యతను తెలియజేశారు. విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.జగదీశ్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్రను, ప్రాముఖ్యతను తెలియజేశారు. విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా.ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ… మహిళలకు విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ అడ్మిషన్లలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 2017 సంవత్సరంలో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కేవలం 8శాతం మహిళా విద్యార్థులతో ప్రారంభమైందని, ఇది ఇప్పుడు 32శాతంకి పెరిగిందని, త్వరలోనే ఇది 50 శాతానికి చేరుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డా. అనుపమ నంబూరు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.