ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )అత్యున్నత ప్రజాస్వామ్యం, గణతంత్ర దినోత్సవం స్ఫూర్తితో.. స్వర్ణాంధ్ర – 2047 ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో జిల్లా ప్రగతికి ఐక్యతతో టీమ్ ఎన్‌టీఆర్‌గా సమష్టిగా కృషిచేద్దామంటూ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విజయవాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, రూరల్ జోన్ డీసీపీ కేఎం మహేశ్వరరాజు తదితరులతో కలిసి పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పది సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్‌లోని లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన, సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరముందన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు-వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి-ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు.
అన్ని రంగాల్లోనూ జిల్లాను నెం.1గా నిలిపేందుకు కృషిచేద్దామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు…..ఉత్తమ పనితీరుకు 517 మందికి ప్రశంసా పత్రాలు…కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, వ్యక్తిగతంగా, బృందంగా సామాజిక సేవలో భాగస్వాములవుతున్న విశిష్ట వ్యక్తులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ శాఖల అధికారులతో పాటు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 517 మందికి కలెక్టర్ లక్ష్మీశ ప్రశంసా పత్రాలు అందజేశారు.
విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి తదితరులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.