(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) – పేదలకు సామాజిక భద్రత కల్పించి ఆర్ధికంగా చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్ భరోసా పథకాన్ని అమలుచేస్తోందని.. క్షేత్రస్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణలో కొత్త సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ అర్బన్ పరిధిలోని పటమట, చిట్టినగర్‌తో పాటు వివిధ కాలనీల్లో పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలుచేస్తోందన్నారు.
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,30,619 పెన్షన్లకు రూ. 98.19 కోట్లు అందజేయడం జరుగుతోందన్నారు. ఉదయం ఆరింటికే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎన్‌టీఆర్ భరోసా మొత్తాన్ని లబ్ధిదారుల చేతిలో పెడుతుంటే వారు ఎంతో ఆనందిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తమకు మ్యాప్ చేసిన లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పెన్షన్ మొత్తం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో జిల్లాను నెం.1 స్థానంలో నిలిపేందుకు అధికార యంత్రాంగం కృషిచేస్తున్నట్లు వివరించారు. ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు.. ఇలా ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేలా చూసినట్లు తెలిపారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.