అనంతపురం : ఐదు రాష్ట్రాల్లో పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగనను పోలీసులు అరెస్టు చేశారు.మహారాష్ట్ర లోని సోలాపూర్ జిల్లా పండరీపూర్ నౌరంగి ఆశ్రమానికి చెందిన లికన్ అశోక్ కులకర్ణి అలియాస్ సచిన్ మానే ను అనంతపురం జిల్లాకు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ… రాత్రి పూట తాళం వేసిన ఇళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. అనంతపురం, గుంతకల్లు, ఆలూరులలో చోరీలు చేశాడన్నారు. వీటితో పాటు ఇతను పాత నేరస్తుడని, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సుమారు 80కి పైగా దొంగతనాలు చేశాడన్నారు.
కర్నాటకలోని మూడు కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడన్నారు. అతనిపై వారంట్లు పెండింగులో ఉన్నాయని, ఇటీవలే జైలు నుండి బయటికొచ్చి మళ్లీ పాత పంథా కొనసాగించాడన్నారు. ఈక్రమంలోనే అనంతపురం, గుంతకల్లు, ఆలూరులలో చోరీలు చేశాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే 23 తులాల బంగారు, 2 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో పేరు మోసిన దొంగను అరెస్టు చేసిన అనంతపురం మూడవ పట్టణ సి.ఐ ధరణి కిషోర్, సిసిఎస్ సి.ఐ జి.టి నాయుడు, గుంతకల్లు ఒన్ టౌన్ సి.ఐ రామసుబ్బయ్య, ఎస్సైలు గోపాలుడు, నాగరాజుల ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు శ్రీధర్, శ్రీనివాసులు కానిస్టేబుళ్లు ఫరూక్, రంజిత్, బాలకృష్ణ, దాస్ ను జిల్లా ఎస్పీ అభినందించారు.