అమరావతి, ఆంధ్రప్రభ: కాంట్రాక్ట్ ప్రాతిపది కన రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో 434 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వి.రామిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. జోన్-1లో 186, జోన్-2లో 220, జోన్-3లో 34. జోన్-4లో 94 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఖాళీల సంఖ్యను డిపార్ట్ మెంట్ అవసరాలన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరుగుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ మరియు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. దరఖాస్తు ప్రొఫార్మాజ హెచ్‌టీటీపీ://సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.ఎన్‌ఐసి.ఇన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తుల్ని అక్టోబర్ 5 తేదీ సాయంత్రం 5 గంటల లోపు జోన్ల వారీగా నిర్ధేశించిన విశాఖపట్నం, రాజమహేంద్రవవరం, గుంటూరు, కడప రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌కార్యాలయాల్లో అందజేయాల్సిందిగా హెల్త్ డైరెక్టర్ సూచించారు. ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మహిళా, వికలాంగ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు.
అకడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్ అర్హతల్ని దరఖాస్తుదారులు కలిగి ఉండాలన్నారు. వెయిటేజ్‌ను లెక్కించడానికి జీఎన్‌బీ/బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తరువాత వెయిటింగ్ పిరియడ్‌ను వెయిటేజీ కోసం తీసుకోబడుతోందన్నారు. నిర్ణీత అర్హతకు సమానమైన అర్హత కలిగి ఉంటే ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాల్సిందిగా సూచించారు. లేదంటే ఆ దరఖాస్తుల్ని తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు దారుల వయసు గరిష్టంగా 42 సంవత్సరాలకు మించరాదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మాజీ సైనికుల కోసం మూడు, వికలాంగులకు పది సంవత్సరాలు చొప్పున వయోపరిమితితో సడలింపు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ,ఎస్టీ, బీసీ వికలాంగ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కోసం సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ పేరున డీడీ తీయాల్సిందిగా హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి సూచించారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను పరిశీలించాలన్నారు.