Monday, November 25, 2024

ఆసరా కాదు టోకరా.. అన్నదెవరో తెలుసా!

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మహిళలకు ఈ ప్రభుత్వం అందిస్తున్నది ఆసరా కాదని, టోకరా వేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఉద్దరించినట్లు- ప్రగల్భాలు పలుకుతోందని విమర్శిం చారు. జూమ్‌ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టిన చంద్రబాబు మహిళలకు అండగా నిలిస్తే.. ఈ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకే పెద్ద టోకరా వేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు డ్వాక్రా మహిళలను పీక్కుతినేలానే ఉన్నాయితప్ప, వారిని ఉద్దరించేలా లేవన్నారు. చంద్రబాబు హయాంలో విభజన జరిగి, ఆర్థిక సమస్యలున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ. 18,600 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేశారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తే, దాన్ని ఇప్పుడు రూ. 3 లక్షలకు కుదించారన్నారు.

రెండున్నరేళ్లలో కాపు కార్పొరేషన్‌ నుంచిగానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచిగానీ ఈ ప్రభుత్వం ఏ ఒక్క మహిళకైనా అండగా నిలిచిన దాఖలాలు ఉన్నాయా అని అనిత ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేసి, ప్రజలకు కూరగాయలు, ఉప్పు, పప్పు కూడా అందకుండా చేయడమేనా ఆసరా అంటే అనడిగారు. గ్యాస్‌ ధరలు పెంచేసి, మహిళలు కనీసం గంజినీళ్లు కూడా తాగకుండా చేయడమేనా ఆసరా పథకమంటే అని ప్రశ్నించారు. ఇదివరకు మహిళా సంఘాల్లోనే కల్యాణమిత్ర, బీమామిత్ర, ఆరోగ్యమిత్రలు ఉండేవారని, వారందరినీ లేకుండా చేసి, ఈ ప్రభుత్వం వలంటీ-ర్‌ వ్యవస్థను తీసుకొచ్చిందని విమర్శించారు. ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచేసి, అన్నింటికీ మించి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా చేసి ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తారో పాలకులే చెప్పాలని అనిత డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement