హాస్టల్ విద్యార్థినులే అతని టార్గెట్
ఫొటో షూట్ పేరిట ఆగడాలు
ఎదురు తిరిగిన స్టూడెంట్స్ కి టార్చర్
తిరగబడ్డ బాలికలు.. పోలీసులకు ఫిర్యాదు
నిందితుడిపై పోక్సో కేసు నమోదు
పరారీలో కామాందుడు..
కొనసాగుతున్న పోలీసుల వేట
ఆంధ్రప్రభ స్మార్ట్, ఏలూరు : రోజుకో అమాయక బాలికను చెరబట్టిన ఓ కామాంధుడైన వార్డెన్ గాథ ఇది.. ఏపీలో సంచలనం రేపింది. ఫొటో షూటింగ్ పేరిట బాలికలను లొంగదీసుకోవటమే అతని పని. ఎదురిస్తే సైకోగా చితకబాదేవాడు. ఈ వార్డెన్ లైంగిక చర్యల్లో ఒక్కొక్క కథ వెలుగుచూస్తుంటే సభ్య సమాజం చీకొడుతోంది. రోజుకో బాలికతో కాలక్షేపం.. ఆదివారం సతీమణితో సరసం.. ఇదీ ఈ నయా కీచకుడి ప్రవృత్తి అని బాధిత బాలికలు చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఏలూరు మహిళ పోలీసు స్టేషన్లో బాధిత బాలికల మొర ఇలా ఉంది. ఏలూరు జిల్లా కేంద్రంలో ఆశ్రమం పేరుతో బాలికల వసతి గృహం ఉంది. ఇందులో 50 మంది బాలికలు వసతి పొందుతున్నారు. వేర్వేరు విద్యా సంస్థల్లో చదుతున్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు హాస్టల్ నిర్వహణను భరించలేని స్థితికి చేరింది. ఏలూరుకి చెందిన శశికుమార్ ఈ వసతిగృహాన్ని వశం చేసుకున్నాడు.
చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్‌గా శశికుమార్ పని చేస్తున్నాడు. ఏలూరులో ఫొటో స్టూడియోను నడుపుతున్నాడు. తన రెండో భార్యను వార్డెన్‌గా, కేర్ టేకర్‌గా తన మేనకోడలును నియమించాడు. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని ఫొటోషూట్ పేరుతో దూర ప్రాంతాలకు తీసుకెళ్లటం ప్రారంభించాడు. అక్కడ వారిని లోబర్చుకుని లైంగిక అవసరాలు తీర్చుకునే వాడని బాధితులు ఆరోపించారు. వ్యతిరేకిస్తే ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడని కన్నీరుమున్నీరయ్యారు. ఏలూరులో ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి తరలించే విధంగా శశికుమార్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన కోరిక మేరకు ఆయా హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు తరలించినట్టు బాధితులు తెలిపారు.
ఈ ఘాతుకం బయటపడింది ఇలా..
ఫొటోషూట్ అంటూ ఈనెల 15వ తేదీన ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి 16వ తేదీన రాత్రి తిరిగి తీసుకొచ్చి వసతి గృహంలో దింపేశాడు. రాత్రి సమయంలో ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా మిగిలిన బాలికలు ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని ఆమె వారికి చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ మిగతా వారికి ఆ ఆ బాలిక తన సీక్రెట్ చెప్పిందనే అక్కసుతో అందరనీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. వార్డెన్ ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
బాలికల తల్లిదండ్రుల రాకతో..
బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వసతిగృహాన్ని పరిశీలించారు. బాలికల వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ అన్నారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ సుబ్బారావు, టూ టౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు శశికుమార్ పరారీలో ఉన్నాడు.