Saturday, November 23, 2024

ఉత్తర భారత యాత్ర.. రాజమహేంద్రవరంలో మార్చి 19న ప్రత్యేక‌ రైలు ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: పర్యాటకప్రియుల కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ప్రత్యేక తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రభావం క్షీణించడంతో యాత్రికులు పర్యాటకం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలో రాజమహేంద్రవరం, సామర్లకోట జంక్షన్‌, తుని, విశాఖపట్నం మీదుగా ఉత్తర భారత యాత్ర నిర్వహించనున్నట్లు రైల్వే ప్రకటించింది. విజయవాడలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీజీఎం కిషోర్‌ సత్య, ఏరియా మేనేజర్‌ కృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్‌ దర్శన్‌’లో భాగంగా ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ వివరాలు ప్రకటించారు.

మార్చి 19 ఉదయం రాజమహేంద్రవరంలో ఈ రైలు బయలుదేరి సామర్లకోట జంక్షన్‌, తుని, విశాఖపట్నం మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. 9 రోజులు, 8 రాత్రులు ఉండే ఈ పర్యాటక ప్యాకేజీలో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్‌సర్‌, హరిద్వార్‌లలో సందర్శనీయ ప్రదేశాలు, ప్రముఖ ఆలయాలను యాత్రికులకు చూపిస్తామని వివరించారు. ఈ రైలులో 12 స్లీపర్‌ క్లాస్‌, ఒక ఏసీ త్రీ టైర్‌ బోగీతోపాటు ప్యాంట్రీ కార్‌ ఉంటుందన్నారు. స్లీపర్‌ క్లాస్‌లో వెళ్లేందుకు యాత్రికులు రూ. 8510, ఏసీ త్రీ టైర్‌ కోసం రూ. 10 వేల 400 చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ప్రభుత్వోద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించు కోవచ్చన్నారు. టూర్‌ ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు ఉదయం టీ, కాఫీతోపాటు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ ప్యాకేజీ కోసం పర్యాటకులు ఐఆర్‌సీటీసీటూరిజం.కామ్‌ వెబ్‌సైట్‌లో కానీ, బాలాజి 8287932312, లలిత 9701360675, చందన్‌ 8287932318, టూరిజం సెల్‌ 9701360701 నంబర్లలో కానీ స్పందించవచ్చని ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్‌ సత్య సూచించారు.

హైదరాబాద్‌ నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్‌ ప్యాకేజీలు..
దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ డొమెస్టిక్‌ ఫ్లైట్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో హైదరాబాద్‌ నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. మార్చి 1, 11, 21, ఏప్రిల్‌ 15, 21, మే 10, 17 తేదీల్లో మిస్టికల్‌ కశ్మీర్‌ విత్‌ హౌస్‌ బోట్‌ అకామడేషన్‌ పేరుతో ఆరు రోజులు, ఐదు రాత్రులు ఉండేలా శ్రీనగర్‌, సోన్‌మార్గ్‌, గుల్మార్గ్‌, పహల్గాం ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజ్‌ కోసం యాత్రికులు రూ. 27 వేల 750 చెల్లించాలి. ఏప్రిల్‌ పదో తేదీన హ్యాపీ హిమాచల్‌ అండ్‌ పాపులర్‌ పంజాబ్‌ పేరుతో 8 రోజులు, 7 రాత్రుల టూర్‌ ప్యాకేజీ ధర రూ. 33 వేల 100గా నిర్ధారించింది. ఈ పర్యటనలో చండీగఢ్‌, సివ్లూ, ధర్మశాల, అమృత్‌సర్‌ సందర్శించవచ్చు. హైదరాబాద్‌ నుంచి మార్చి 3, 5, 10, 12, 17, 19, 24, ఏప్రిల్‌ 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో తిరుపతి బాలాజి దర్శనం పేరుతో డొమెస్టిక్‌ ఫ్లైట్‌ ప్యాకేజీ నడుస్తుంది. ఈ పర్యటనలో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమల దర్శించవచ్చు. రూ. పది వేల 315 ధరతో ఉన్న ఈ ప్యాకేజీలో తిరుపతి దర్శనం టికెట్‌ కూడా కలిపి ఉంటుంది. ఇవి కాక విజయ గోవిందం పేరుతో ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి మూడు రోజులు, రెండు రాత్రులతో కూడిన తిరుమల- తిరుచానూరు- తిరుపతి ప్రత్యేక రైలు నడుస్తుంది. అందుకోసం రూ. 3 వేల 410 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement